MachilipatnamLocal News
July 14, 2026
జిల్లా

స్టీల్ ప్లాంట్ ఘటనలో 8 మంది మరణించడం బాధాకరం: మాజీ మంత్రి పేర్ని నాని

  • June 9, 2026
  • 0 min read
[addtoany]
స్టీల్ ప్లాంట్ ఘటనలో 8 మంది మరణించడం బాధాకరం: మాజీ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం:

స్టీల్ ప్లాంట్ ఘటనలో 8 మంది మరణించడం… మరి కొందరు క్షతగాత్రులుగా మారడం పట్ల మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య(నాని) సంతాపం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సెక్షన్ లో 22 మంది పని చేయాల్సి ఉండగా 11 మందితో పనులు చేయించడం వలన దారుణం జరిగింది అన్నారు.

నాని మాట్లాడుతూ ప్రమాద ఘటనలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా తెలుస్తుంది. అనుభవం కలిగిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విఆర్ఎస్ పేరిట ఇంటికి పరిమితం చేయడం, సాంకేతిక అనుభవం లేని వారితో విధులు నిర్వహించడం వల్లనే ప్రమాదానికి కారణం కావచ్చు. 3.2 మిలియన్ టన్నుల ఉత్పాదన సామర్థ్యం ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో 18 వేల మంది కార్మికులు పనిచేయగా… 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో ఎనిమిది వేలకు ఉద్యోగులను పరిమితం చేయడం దారుణం. విశాఖ ఉక్కు యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా కాస్ట్ కటింగ్ పేరిట చేపట్టిన విధానాల వల్లనే ప్రమాదం జరిగి తీరని నష్టం కలిగింది. అనుభవం లేని వ్యక్తులచే పనులు చేపట్టి యాజమాన్యం కార్మికులను పొట్టన పెట్టుకుంది అని తీవ్రంగా మండిపడ్డారు.

ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ అహంకారంతో బాధితులు కార్మిక సంఘాల పట్ల వ్యవహరించిన తీరు దారుణం. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జగన్ వచ్చాడా అంటూ వ్యంగంగా మాట్లాడడం అతని దుసంస్కారానికి నిదర్శనం. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై యావత్ కార్మిక లోకం శోకసముద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు కార్మికుల పట్ల ప్రవర్తించిన తీరు సంస్కారహీనంగా ఉంది. పార్థివ దేహాల మీద చిల్లర ఏరుకునే విధంగా మంత్రుల మనస్తత్వం, ప్రవర్తన ఉంది. బాధిత కుటుంబాలను కార్మిక సంఘాలను ఓదార్చాల్సిన స్థాయిలో ఉన్న రాష్ట్ర మంత్రులు అహంకారంగా, కర్కశంగా వ్యవహరించడం దారుణం.

కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం గురించితెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు తీరిక లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు ఘటన స్థలానికి వెళ్లకుండా విజయవాడలో రివ్యూల పేరిట కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకుకు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో అన్న సంస్కారాన్ని నేర్పాలి.

బాధితుల పరామర్శకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యదూరమైన మాటలను మాట్లాడుతున్నారు. గత వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తే తానే అడ్డుకున్నానంటూ తప్పుడు ఆరోపణలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అప్పటి కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా దీపం పథకం కింద 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తే అప్పటి సీఎం గా ఉన్న జగన్ అసెంబ్లీ ద్వారా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారని చెప్పింది వాస్తవం కాదా? వైయస్ జగన్ పోరాటం వలన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడం జరిగిందనేది అక్షర సత్యం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తనతో కార్మిక సంఘాలు సహకరించలేదని నేపంతో క్యాపిటల్ మైండ్లు విశాఖ ఉక్కుకు కేటాయింపు జరపలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం దుర్మార్గం అని నాని దుయ్యబట్టారు.

నాడు నేడు వైఎస్ఆర్సిపి పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలను కల్పించి, మృతుల కుటుంబాలకు మరియు క్షతగాత్రులకు గతంలో జగన్ ప్రభుత్వంలో అందించిన పరిహారం మాదిరిగా అందించాలి అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.

About Author

SSN