పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విజయవంతం చేసిన శ్రేణులకు కొట్టే వెంకట్రావు ధన్యవాదాలు
మచిలీపట్నం:
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో నిర్వహించిన భారీ ర్యాలీ, బహిరంగ సభ అత్యంత వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమాలను అడుగడుగునా విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ నాయకుడు కొట్టే వెంకట్రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన శ్రేణులు వేలాదిగా తరలివచ్చి చూపిన ఉత్సాహం, అంకితభావం పవన్ కళ్యాణ్‌పై వారికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నినప్పటికీ, కార్యకర్తల బలమే తమను ముందుకు నడిపించిందని, ఎంతటి అవరోధాలు ఎదురైనా పవన్ కళ్యాణ్‌కు బలంగా నిలవడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.
పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులోనూ జనసేన బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు శాయన శివయ్య, మాదివాడ రాము, పృథ్వీ ప్రసన్న, వాలిశెట్టి మల్లి, డాక్టర్ మాధవి మరియు బీజేపీ నాయకుడు పంతం గజేంద్ర తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

