పారదర్శకంగా గ్రామసభలు: 491 పంచాయతీల్లో ఓటర్ల విచారణ ప్రారంభం
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న 491 గ్రామపంచాయతీల్లో గురువారం నుండి నాలుగు రోజుల పాటు గ్రామసభలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (DPO) ఎం. ధనలక్ష్మి తెలిపారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు మరియు వారి వివరాలపై బహిరంగ విచారణ కోసం ఈ సభలు ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 497 పంచాయతీలకు గాను 6 పంచాయతీలు కోర్టు వివాదాల్లో ఉన్నందున, మిగిలిన 491 పంచాయతీల్లో రాబోయే పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నామన్నారు. సభల పర్యవేక్షణకు 90 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. జిల్లాలోని 491 పంచాయతీల పరిధిలో మొత్తం 9,98,056 మంది ఓటర్లు ఉండగా, వారిలో 4,84,802 మంది పురుషులు, 5,13,230 మంది మహిళలు, 24 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు.
గ్రామసభల్లో చేపట్టిన పరిశీలన అనంతరం ఓటర్ల తుది జాబితాను ఈ నెల 7న ప్రకటిస్తామని డిపివో తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 4,924 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించేందుకు మొదటి దశలో గెజిటెడ్ అధికారులను, పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు రెండో దశలో ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో నియమిస్తున్నామని పేర్కొన్నారు.

