యోగాతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆటో, లారీ అసోసియేషన్ థీమాటిక్ యోగా ప్రదర్శన
గుడివాడ:
ప్రజలకు వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని, యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.
అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో లారీ, ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఇతివృత్తంతో భారీ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు.
సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు సౌకర్యవంతంగా యోగాసనాలు వేసేందుకు మైదానంలో పచ్చని తివాచీలను ఏర్పాటు చేశారు. స్టేడియం వేదికపై నుంచి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి, శ్రీనివాస్ యోగాసనాలు వేసే విధానాన్ని ప్రదర్శిస్తూ వారిచేత ఆసనాలు చేయించారు. అనంతరం యోగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పాల్గొన్న వారికి అల్పాహారం, రాగి జావా, తాగునీరు అందజేశారు. అలాగే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వరుసగా రెండో సంవత్సరం కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని అదే ఉత్సాహంతో కొనసాగిస్తోందన్నారు. ఆరోగ్య సంరక్షణలో క్యూరేటివ్ హెల్త్ కేర్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనే రెండు విధానాలు ఉన్నాయని, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించడం క్యూరేటివ్ అయితే, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రివెంటివ్ హెల్త్ కేర్ అని వివరించారు.
ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు యోగా అత్యుత్తమ సాధనమని ప్రభుత్వం గుర్తించి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతిరోజూ యోగా చేసే వారు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు దూరంగా ఉండగలరని తెలిపారు. యోగా వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, భవిష్యత్తులో వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, ఆరోగ్యంగా ఉండటం ద్వారా లక్షలాది రూపాయలను ఆదా చేసినట్టేనని కలెక్టర్ పేర్కొన్నారు. యోగాను కనీసం 10 నుంచి 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా మారుతుందని, అనంతరం స్వయంగా యోగా చేయాలనే ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిరోజూ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకుని యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
శాసనసభ్యుడు వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గదర్శకమని అన్నారు. గుడివాడ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమం నిర్వహించేందుకు అనువైన ఎన్టీఆర్ స్టేడియం ఉండటం గుడివాడకు గర్వకారణమని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి రోజు యోగాతోనే తన దినచర్యను ప్రారంభిస్తారని, ఆయన ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి యోగానే ప్రధాన కారణమని చెప్పారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యతను చాటిచెబుతున్నారని తెలిపారు. వయస్సు పెరిగినా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. యోగా క్రమం తప్పకుండా చేస్తే ఉత్సాహం, ఏకాగ్రత, పనితీరు పెరుగుతాయని పేర్కొన్నారు. కనీసం 15 రోజుల పాటు నిరంతరంగా యోగా సాధన చేస్తే అది అలవాటుగా మారుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం కార్యక్రమంలో పురిటిగడ్డ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు, యోగా శిక్షకులు శేష ప్రసన్న, నాగరాజు ఆధ్వర్యంలో అద్భుతమైన యోగా నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే యోగా శిక్షకురాలు కే చందు తన ప్రత్యేక యోగా విన్యాసాలతో హాజరైన వారిని అబ్బురపరిచింది. వారిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందించారు.
కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ రావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటి మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ వాహిని, పర్యాటకశాఖ అధికారి రామ్ లక్ష్మణరావు, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ షాహిద్ బాబు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీ లక్ష్మి, తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, లారీ, ఆటో డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యోగా శిక్షకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

