MachilipatnamLocal News
July 14, 2026
జిల్లా

రైతు పోర్టల్ లో రైతుల వివరాలను సత్వరమే నమోదు చేయించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • June 9, 2026
  • 0 min read
[addtoany]
రైతు పోర్టల్ లో రైతుల వివరాలను సత్వరమే నమోదు చేయించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం:

ఆంధ్రప్రదేశ్ రైతు పోర్టల్ లో జిల్లాలోని రైతులందరి వివరాలను సత్వరమే నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో యూరియా పంపిణీ ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 75% రైతుల వివరాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రీ పోర్టల్ లో నమోదు చేశారన్నారు. జిల్లాలోని రైతులకు సంబంధించిన వివరాలను నూటికి నూరు శాతం పొందుపరచాలన్నారు. ఆ పోర్టల్ లో రైతుల పేర్లు ఉంటేనే యూరియా పంపిణీ వీలు కలుగుతుందన్నారు. లేనిపక్షంలో రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఈనెల 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా కృష్ణా జిల్లాకు ఒక యాప్ వస్తుందని దాని ద్వారా మాత్రమే యూరియా తదితరు ఎరువులు సులభంగా రైతులకు అందుతాయన్నారు.

వ్యవసాయ అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించి గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతుల వివరాలను నూటికి నూరు శాతం నమోదు చేయించేందుకు ముమ్మరంగా కృషి చేయాలన్నారు. రైతులు ఏమాత్రం ఇబ్బంది పడిన ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. చేపల చెరువుల్లో వివరాలను సేకరించి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చేపల చెరువుల్లో వాడకానికి యూరియా ఇవ్వరాదని వ్యవసాయ, ఉద్యాన పంటలకు మాత్రమే యూరియా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చాలాచోట్ల చేపల చెరువులు లేకపోయినప్పటికీ నమోదు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి మణి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, డి సి ఓ చంద్రశేఖర్, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN