రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం
సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. డీఎస్ఓ శివరాం ప్రసాద్ హామీ
మచిలీపట్నం:
కృష్ణాజిల్లా నూతన జిల్లా పౌరసరఫరాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన టి. శివరాం ప్రసాద్‌ను కృష్ణాజిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఎండి ఖాసిం ఆధ్వర్యంలో డీలర్ల సంఘం నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంఘం నాయకులు శివరాం ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో డీలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించారు.
డీలర్ల సమస్యలను సావధానంగా విన్న శివరాం ప్రసాద్ త్వరలోనే రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ సజావుగా జరిగేలా అందరి సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎండి ఖాసిం, ప్రధాన కార్యదర్శి కె. బాపూజీ, జిల్లా ఉపాధ్యక్షురాలు నల్ల పార్వతీ, జిల్లా కార్యదర్శి వణుకూరు విక్రమ్, బాపులపాడు మండల గౌరవ అధ్యక్షుడు ఆర్నేపల్లి శేఖర్, కార్యదర్శి అకునూరి మాణిక్యాలరావు, గన్నవరం మండల అధ్యక్షుడు కోట రాజు, కంకిపాడు మండల ప్రధాన కార్యదర్శి గొరిపర్తి రామారావు తదితరులు పాల్గొన్నారు.

