పోలీసు వ్యవస్థను భజనకు పరిమితం చేస్తున్నారు: పేర్ని నాని
మచిలీపట్నం:
ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు వ్యవస్థతో భజన చేయించుకుంటున్నారని కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. గురువారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 1100 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి సమస్యలు, పనితీరును తెలుసుకోవాల్సిన సీఎం.. భజనకు పరిమితం కావడం దారుణమన్నారు.
ఖద్దర్ కిక్కు కోసం పొగడ్తలకు అలవాటు పడిన చంద్రబాబు శృతి మించి వ్యవహరిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా వినియోగించుకునే విధంగా వీడియో కాన్ఫరెన్స్‌ల పేరుతో ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొంతమంది పోలీసు అధికారులు రాజకీయ నాయకులను మించి సీఎంను పొగడటం పోలీసు సిబ్బందినే విస్మయానికి గురిచేసిందన్నారు.
సోషల్ మీడియా కేసుల్లో వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు చట్టాలను సవరించాలని కొంతమంది పోలీసు అధికారులు సూచించడం దారుణమని అన్నారు. పోలీసు అధికారులు మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను గుర్తుంచుకోవాలని సూచించారు. సోషల్ మీడియా కేసుల్లో నిందితులను రోడ్డుపై నడిపించే పోలీసులు, రాష్ట్రంలో మహిళలు, అభాగ్యులపై అరాచకాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గాడి తప్పిందని పేర్ని నాని ఆరోపించారు. దిశ చట్టాన్ని రద్దు చేసి మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పడం విరుద్ధంగా ఉందన్నారు. రాజమహేంద్రవరంలో వైద్యురాలి మృతిపై, చిత్తూరులో పోలీసుపై దాడి ఘటనలపై ప్రభుత్వం, పోలీసుల చర్యలను ఆయన ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వ్యక్తం చేయడం తప్ప బాధిత ఘటనలపై తగిన చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శించారు. భీమవరంలో పేకాటలపై స్పందించే పవన్ కల్యాణ్ మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి, మహిళల అదృశ్యాలు, మహిళలపై దాడులు గుర్తుకు తెచ్చుకున్న పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు అవి ఎందుకు గుర్తుకు రావడం లేదన్నారు.
అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం అసాధారణ స్థాయిలో ప్రచారం చేస్తోందని పేర్ని నాని విమర్శించారు. ఆరు సంవత్సరాల కాలంలో నిర్మించిన తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్లను ఎమ్మెల్యేలకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని; వాటిని ఎమ్మెల్యేలు వినియోగిస్తారా, గన్మెన్లకు నివాసాలుగా మారుస్తారా అనేది చూడాల్సి ఉందన్నారు.
అమరావతిలో అద్భుతమైన రీతిలో పనులు జరుగుతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు పెయిడ్ వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అసలు అమరావతిలో ఉన్న ప్రజలు, రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వర్షాలపైనే ఆధారపడి, ఎరువులు, సాగునీరు అందక అమరావతి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కూటమి నాయకులు సాకులు, బూటకపు వాగ్దానాలను పక్కనపెట్టి కృష్ణా డెల్టాకు సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
బోండా ఉమాపై తీవ్ర వ్యాఖ్యలు
ఎమ్మెల్యే బోండా ఉమాపై కూడా పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాలగమనంలో డైనోసార్లు, కొన్ని ప్రాచీన కళలు అంతరించిపోయాయని, ఇటీవల విజయవాడలో అంతరించిపోయిన ‘పిట్టలదొర’ ప్రాచీన కళను కూటమిలోని కొందరు ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనపై, తన భార్యపై సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేసిన వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. తాను గోడౌన్ నిర్మించి బియ్యం నిల్వ ఉంచేందుకు ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చానని చెప్పారు. గోడౌన్లో పనిచేసే సిబ్బంది అవకతవకలకు పాల్పడి స్టాక్ తగ్గిందని తెలియడంతో నైతిక విలువలకు కట్టుబడి అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. క్రింది స్థాయి సిబ్బంది చేసిన పొరపాట్లకు బాధ్యత వహిస్తూ పెనాల్టీలతో సహా పరిహారం చెల్లించానని పేర్ని నాని తెలిపారు. అధికారులకు సమాచారం ఇచ్చిన పది రోజుల్లోనే తనపై, తన భార్యపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
తాను ఎవరికో రూ.50 కోట్లు ఇచ్చానంటూ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి దమ్ముంటే దానికి ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. తప్పుడు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతామని పేర్ని నాని హెచ్చరించారు.

