MachilipatnamLocal News
July 14, 2026
జిల్లా

పోలీసులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం – పేర్ని నాని ఫైర్

  • June 9, 2026
  • 0 min read
[addtoany]
పోలీసులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం – పేర్ని నాని ఫైర్

బందరు పోర్టు అమ్మకంపై కూడా సంచలన ఆరోపణలు

మచిలీపట్నం:

రాష్ట్రంలోని పోలీసు కానిస్టేబుళ్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరమయ్య (నాని ) తీవ్ర విమర్శలు చేశారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులను మోసం చేసినట్లే పోలీసులను కూడా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, టీఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని, లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు వేలాది రూపాయలు బాకీ ఉన్నాయని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదుపై రోజువారీ లక్ష్యాలు విధించి పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని, టార్గెట్ చేరుకోకపోతే వీఆర్‌కు పంపిస్తామని బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీఎస్పీ, ఏఆర్ రిజర్వు కానిస్టేబుళ్ల సమస్యలు మరింత దారుణంగా ఉన్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన శని, ఆదివారాల సెలవులు, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థ పేరుతో కానిస్టేబుళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, వెంటనే ఆ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసుల సంక్షేమంపై స్పందించాలని పేర్ని నాని కోరారు.

అదే సమయంలో మచిలీపట్టణం పోర్ట్ అంశంపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. బందరు పోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అని, దానిని తెలంగాణకు అప్పగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సీట్ల కేటాయింపు, పోలీసు సంక్షేమం, బందరు పోర్టు అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్ని నాని స్పష్టం చేశారు.

About Author

SSN