మచిలీపట్నం కూటమిలో ‘మిత్రభేదం’
SSN
- April 19, 2026
- 0 min read
[addtoany]
2024 ఎన్నికలకు ముందు కూటమిగా జతకట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో… జనసేన 22 స్థానాలలోనే పోటీ చేసినప్పటికీ జనసేన ప్రభావం రాష్ట్రంలోని 175 స్థానాలలోను పనిచేసింది. కూటమిలోని తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు తమ పూర్తి సామర్ధ్యాన్ని వెచ్చించి ఎన్నికలలో విజయం కోసం కృషి చేశాయి.
మచిలీపట్నం లో సైతం జనసైనికులు… తెలుగుదేశం ఎంఎల్ఏ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలుపు కోసం అహరహం కష్టపడ్డారు. జనసైనికులు ఎవరికి వారు తామే నిలబడినంతగా రవీంద్ర గెలుపు కోసం శ్రమించారు. దాంతో ఎన్నికలలో కూటమి అభ్యర్థి రవీంద్రకు యాభై వేల పై చిలుకు మెజారిటీ వచ్చింది. జనసైనికులందరూ సంబరాలు చేసుకున్నారు. మేమే అధికారంలోకి వచ్చాము అనుకున్నారు. అదే భ్రమలో రెండేళ్ల నుంచి ఉన్నారు.
మచిలీపట్నం ఎంఎల్ఏ, రాష్ట్ర ఎక్సైజ్, భూగర్భ వనరుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం లో ఏ అధికార, అనధికార కార్యక్రమంలో పాల్గొన్నా….. మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జి బండి రామకృష్ణ కు మంత్రి పక్కనే ఒక సీటు. వాహ్ …మేము పక్కన లేకపోతే ఏమీ లేదు అనుకున్నారు జనసేన నాయకులంతా! మాదే హవా అనుకున్నారు జన సైనికులంతా!
కొబ్బరితోట సెగ..
కట్ చేస్తే…. ఏప్రిల్ 1 న పోలీస్ పహారాలో మునిసిపల్ అధికారులు కొబ్బరి తోటలో జనసైనికుడి ఇంటిని, అనధికార కట్టడమంటూ ప్రొక్లైనర్లతో కూల్చివేత మొదలు పెట్టారు. జన సైనికుడి హాహా కారాలకు వైస్సార్సీపీ నాయకులు పరుగెత్తుకు వచ్చి అధికారులకు, పోలీసులకు అడ్డంగా నిలబడి, వారితో ఘర్షణకు దిగారు. అయినా కట్టడం నేలమట్టం అయింది.
బాధిత జనసేన కార్యకర్తకు మద్దతుగా నిలబడిన మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి పేర్ని కిట్టు… మంత్రి రవీంద్ర తన ఇగోను తృప్తి పరచుకోవడానికే జనసేన కార్యకర్త ఇల్లు కూల్చాడని తీవ్ర విమర్శలు చేసారు. తెలుగుదేశం పార్టీ ఆరవ డివిజన్ ఇంచార్జి దిలీప్ ఇంటి నిర్మాణానికి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా బాధిత జనసేన కార్యకర్త ఆరోపణలు చేశారు. దాంతో కొబ్బరి తోటలో ఇంటి కూల్చివేత వివాదం కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన మధ్య ఎడబాటుకు కారణమైంది.
ఒత్తిడిలో బండి రామకృష్ణ.. రంగంలోకి ఎంపీ బాలశౌరి
ఇదేమిటి మేము కూటమిలో భాగమే కదా! అంటే ప్రభుత్వంలో భాగమే కదా! మా ప్రభుత్వంలో మా ఇల్లే కూలుస్తారా? ఎన్నికలలో కూటమి గెలుపు కోసం రాత్రనకా … పగలనకా…. కష్టపడితే మా ఆస్తిని ధ్వసం చేస్తారా? అని జనసైనికులలో అలజడి మొదలయింది. గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడూ మంత్రి కొల్లు రవీంద్ర పక్కన కూర్చునే మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జి బండి రామకృష్ణ తీవ్ర విమర్శలకు గురయ్యారు. కార్యకర్తకు న్యాయం చేయటంలో విఫలమయ్యాడని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపించాయి. బండి రామకృష్ణ నాయకత్వంపై కార్యకర్తలలో వ్యతిరేకత మొదలయినట్లుగా తెలుస్తుంది. జనసేన నాయకుల మీద కార్యకర్తల ఒత్తిడి పెరిగింది. ఎంత పెరిగిందంటే ఆ ఒత్తిడి వేడి ఢిల్లీలో ఉన్న మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు, జనసేన నేత వల్లభనేని బాలశౌరిని గట్టిగా తాకింది.
దాంతో బాలశౌరి అనివార్యంగా మచిలీపట్నంలో పర్యటించి నష్టపోయిన జనసేన కార్యకర్తను పరామర్శించారు. పరామర్శ అనంతరం ఎంపి మీడియాతో మాట్లాడుతూ అధికారులు సంయమనం పాటించాలని హితవు పలికారు. అలాగే నష్టపోయిన జనసేన కార్యకర్తకు తన సొంత డబ్బుతో ఇంటిని పునర్నిర్మిస్తానని ప్రకటించారు.
బాలశౌరి ఎంట్రీతో మారిన సమీకరణాలు!
అనంతరం బాలశౌరి ఆధ్వర్యంలో మచిలీపట్నం జనసేన నేతలంతా సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సమావేశంలో మచిలీపట్నంలో జనసేన పార్టీ పరిస్థితి పై వాడిగా వేడిగా చర్చించారు. కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీ చేసిన పని వల్ల తాము ఊళ్ళో తల ఎత్తుకోలేక పోతున్నామని ఏకరువు పెట్టినట్లుగా తెలుస్తుంది. దాంతో జనసైనికులంతా తమకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం నాయకులతో కలిసి ఏ విధమైన కార్యక్రమాలలో పాల్గొన కూడదని తీర్మానించుకున్నారని అంటున్నారు. తీసుకున్న నిర్ణయం ప్రకారం జనసైనికులు మంత్రి రవీంద్ర తో వేదికను పంచుకోవట్లేదు.
టీడీపీ మౌనం.. మంత్రి వ్యూహం?
కూటమి పార్టీలలో ముఖ్యమైన జనసేన లో ఇంతటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. సయోధ్య దిశగా ఎటువంటి అడుగులు తెలుగుదేశం నుంచి పడటం లేదు. దాంతో అసలే ఆగ్రహం తో ఉన్న జనసేనలో రోజు రోజుకు అసహనం పెరుగుతుంది.
స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం… అంటూ తిరిగిన రవీంద్ర, రామకృష్ణ లు ఎడ మొహం పెడ మొహం అయ్యారు. మిత్రలాభం తో రవీంద్ర…మంచి మెజారిటీ తో ఎమ్మెల్యే గా విజయం సాధించి మంత్రి సైతం అయ్యారు. ఐదేళ్ల పదవీ కాలంలో దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తుంది. ఇంకా మూడేళ్ళ వరకు మిత్రులతో పని లేదనుకున్నట్లున్నారు! మంత్రివర్యులు… అందుకే మిత్రబేధం తెచ్చుకున్నారేమో అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కూటమిలో కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిన్నప్పుడు, అది భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. కార్యకర్తలకు ఇబ్బంది ఎదురైనప్పుడు పార్టీ నాయకులు అండగా నిలబడాలి. కానీ ప్రతిపక్ష వైసీపీ నేత పేర్ని నాని స్పందించిన తరువాతే స్థానిక జనసేన నాయకత్వంలో చలనం వచ్చిందని జనసేన కార్యకర్తలలో బలంగా నాటుకుంది.
ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన కార్యకర్తలకు మద్దతుగా నిలబడటం అనేది రాజకీయంగా వ్యూహాత్మక అడుగు. మచిలీపట్నం లో జనసేనకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ స్థానికంగా సమర్ధవంతమైన నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. స్థానికంగా జనసేన పటిష్టతకు, కార్యకర్తలలో మనోధైర్యం నింపడానికి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు ముందు ఎటువంటి చర్యలు చేపడతాడో చూడాలి!
శ్యామ్ కాగిత
మచిలీపట్నం

