MachilipatnamLocal News
June 24, 2026
మచిలీపట్నం

ప్రజలకు చేరువగా పాలన.. సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

  • June 22, 2026
  • 0 min read
[addtoany]
ప్రజలకు చేరువగా పాలన.. సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

ప్రజలనుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం నగరంలోని బృందావన్ థియేటర్ పక్కన ఉన్న తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులు చెప్పిన సమస్యలను ఓపికగా ఆలకించిన మంత్రి వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి వారం గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, సంక్షేమం, పింఛన్లు, గృహ స్థలాలు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్‌లో 36 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గత వారం అందిన 24 అర్జీలలో స్థానిక పరిధిలో ఉన్న ఎక్కువ శాతం సమస్యలను పరిష్కరించామని చెప్పారు.

ఇప్పటి వరకు మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 423 అర్జీలు అందగా, వాటిలో 329 సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. గృహ స్థలాలు, పింఛన్లు వంటి అంశాలకు సంబంధించిన కొన్ని అర్జీలు విధివిధానాల ప్రకారం భవిష్యత్తులో పరిష్కరించబడతాయని తెలిపారు.

ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పార్టీ కార్యాలయంలో కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పింఛన్ల పంపిణీ, రేషన్ సేవలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల అమలుతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అర్జీలలో కొన్ని

  • మచిలీపట్నం 17వ వార్డు, చెమ్మనగిరిపేట నివాసి, టి. సుధాకర్, ఆస్తి పన్నుకు సంబంధించి వినతిపత్రం సమర్పించారు.

తన ఇంటిలో మూడు గదులు నివాస అవసరాలకు, ఒక గది మాత్రమే దుకాణంగా వినియోగిస్తున్నప్పటికీ, మున్సిపల్ ఆస్తి పన్ను రికార్డుల్లో మూడు గదులు దుకాణాలుగా, ఒక గది నివాసంగా నమోదు చేయబడినట్లు పేర్కొన్నారు. దీనివల్ల అధిక ఆస్తి పన్ను విధించబడుతోందని తెలిపారు. అందువల్ల సంబంధిత అధికారులు స్థల పరిశీలన నిర్వహించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించి, అవసరమైతే ఆస్తి పన్ను రికార్డులను సవరించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా మంత్రిని కోరారు.

  • 6వ డివిజన్ పరిధిలోని ఎన్జీవో కాలనీలో పలుచోట్ల వీధి విద్యుత్ దీపాలు సరిగా పనిచేయడం లేదని, వర్షాకాలంలో తగిన వెలుతురు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుపుతూ, పనిచేయని విద్యుత్ దీపాలను మరమ్మతులు చేయించి, అవసరమైన చోట్ల నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆరవ డివిజన్ పార్టీ ఇంచార్జ్ ఐ దిలీప్ కుమార్ అర్జీ సమర్పించారు.

కార్యక్రమంలో మచిలీపట్నం నియోజకవర్గ ప్రత్యేక అధికారి మార్కెటింగ్ ఏడి నిత్యానంద్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్ హసీం బేగ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు సుబ్రహ్మణ్యం, పిప్పళ్ల వెంకట కాంతారావు, అక్కుమహంతి రాజా, మధు, తలారి సోమశేఖర్, కే సుశీల తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author

SSN