MachilipatnamLocal News
June 24, 2026
జిల్లా

మాతా–శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి. యుగంధర్

  • June 23, 2026
  • 0 min read
[addtoany]
మాతా–శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి. యుగంధర్

మచిలీపట్నం:

మాతా, శిశు మరణాలు మృత శిశు జననాలను తగ్గించేందుకు అన్ని శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి. యుగంధర్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి. యుగంధర్ అధ్యక్షతన ఉపజిల్లా స్థాయి మాతా–శిశు మరణాల సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ప్రేమ్‌చంద్, నిపుణుల కమిటీ సభ్యులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో ఐదు శిశు మరణాలు, ఒక మృత శిశు జనన ఘటనను సమగ్రంగా సమీక్షించారు. తల్లులు, కుటుంబ సభ్యుల్లో శిశు పాలిచ్చే విధానాలు, శిశు సంరక్షణ, సురక్షిత నిద్ర పద్ధతులపై అవగాహన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. శిశువులు తల్లులు నిద్రించే సమయంలో గట్టి, సమతల ఉపరితలంపై నిద్రించడం అవసరమని, లేకపోతే తల్లి బరువు శిశువుపై పడటం వల్ల శ్వాస ఆడక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. కొన్ని ఘటనల్లో ముందస్తు ప్రసవాలు, గర్భంలో శిశు ఎదుగుదల లోపం ప్రధాన కారణాలుగా ఉన్నట్లు గుర్తించారు. గర్భిణీలలో అంటువ్యాధులు, రక్తహీనత, పోషకాహార లోపం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అధిక ప్రమాద పరిస్థితులను ముందుగానే గుర్తించి అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు సకాలంలో తరలించాలని సూచించారు.

జననాల మధ్య తగిన విరామం పాటించడం వల్ల తల్లుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్ యుగంధర్ తెలిపారు. ప్రసవానంతర కుటుంబ నియంత్రణ సేవలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో పెరుగుతున్న శస్త్రచికిత్స ప్రసవాల సంఖ్యను తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న మాతృత్వ సంరక్షణ శిక్షణ కార్యక్రమంపై కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గర్భిణీలకు గర్భధారణ సమయంలో చేయాల్సిన వ్యాయామాలు, పోషకాహారం, మానసిక ఆరోగ్య పరిరక్షణ, సహజ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ఆశా కార్యకర్తలు ఇంటింటా నిర్వహించే నవజాత శిశు, బాలల సంరక్షణ సందర్శనలను సమర్థవంతంగా నిర్వహించి కుటుంబ సభ్యులకు శిశు పాలిచ్చే విధానం, స్నానం చేయించే విధానం, సురక్షిత నిద్ర పద్ధతులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామ ఆరోగ్య, పోషకాహార సమావేశాల్లో కూడా ఈ అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. గ్రామ ఆరోగ్య సిబ్బంది, మధ్యస్థాయి ఆరోగ్య సేవలందించే సిబ్బంది గర్భిణీలకు అధిక ప్రమాద లక్షణాలు, ప్రమాద సూచనలు, తక్షణ వైద్య సేవల అవసరంపై అవగాహన కల్పించి అవసరమైతే సకాలంలో వైద్య కేంద్రాలకు తరలించాలని సూచించారు.గర్భిణీల రక్తపోటు పరీక్షలను చేతితో నిర్వహించే పరికరాల ద్వారా పరీక్షించడం ద్వారా అధిక ప్రమాద గర్భిణీలను మరింత ఖచ్చితంగా గుర్తించవచ్చని డాక్టర్ యుగంధర్ తెలిపారు. సకాలంలో ప్రమాదకర కేసుల గుర్తింపు, సమర్థవంతమైన వైద్య రిఫరల్ వ్యవస్థ, కుటుంబాల అవగాహన, నాణ్యమైన వైద్య సేవల ద్వారా నివారించగల మాతా–శిశు మరణాలు, మృత శిశు జననాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.

About Author

SSN