మచిలీపట్నం :
జనాభా గణన ప్రతి ఒక్కరూ సొంతంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈనెల 30వ తేదీ వరకు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా గురువారం నుండి ప్రారంభమైన జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో తన కంప్యూటర్ లో స్వీయ జనగణన ఆన్లైన్ పోర్టల్ se.census.gov.in ద్వారా తన సొంత వివరాలను నమోదు చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలన్నారు.
ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. . మే 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వచ్చి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టి స్వీయ గణనను ధృవీకరిస్తారన్నారు. పౌరులందరికీ సమానంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ జనగణన కార్యక్రమం సమాచార సేకరణ మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగనుందని మొదటి దశలో ఇవాల్టి నుంచే ఇండ్ల గణన ప్రారంభమైందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో జనాభా లెక్కల సేకరణ మొదలవుతుందన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన ఇండ్ల జాబితా… ఇండ్ల గణన, కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.