మచిలీపట్నం:
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి అర్జీలు సమర్పించిన ఇద్దరు అర్జీదారులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం సాయంత్రం స్వయంగా మాట్లాడారు.
గుడివాడ మండలం పర్ణాస గ్రామానికి చెందిన పల్లపోతు ఏడుకొండలు, తమ ట్రాక్టర్ ద్వారా ధాన్యం ఇంటికి తరలించేందుకు రహదారి ఆక్రమణల వల్ల ఇరుకుగా మారిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పెనమలూరు మండలం తాడిగడప మున్సిపాలిటీకి చెందిన ఎన్. సీతమ్మ, తమ గృహాల సమీపంలో గేదెల రొచ్చు కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమలు విస్తరిస్తున్నాయని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి ఫోన్ ద్వారా అర్జీదారులతో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ తో పాటు మీకోసం కార్యక్రమం డిప్యూటీ తహసిల్దార్ బేగ్ ఉన్నారు.