MachilipatnamLocal News
July 19, 2026
పోలీస్ & లీగల్ డైరీ

బైండోవర్ నిబంధనల ఉల్లంఘన.. వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష

  • June 3, 2026
  • 0 min read
[addtoany]
బైండోవర్ నిబంధనల ఉల్లంఘన.. వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష

మచిలీపట్నం:

బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మరో నేరంలో పాల్గొన్న వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మచిలీపట్నం పరిధిలో బైండోవర్ అమలులో ఉన్న వ్యక్తిని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జైలుకు తరలించడం జిల్లాలోనే తొలిసారి కావడం విశేషం.

పోలీసుల కథనం ప్రకారం మచిలీపట్నంలోని భాస్కరపురానికి చెందిన తన్నేరు నాగరాజు (39) గతంలో పలు నేరాల్లో పాల్గొన్న నేపథ్యంలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 129(ఈ) ప్రకారం ఎంసీ నెం.44/2026 ద్వారా ఒక సంవత్సరం పాటు బైండోవర్ చేశారు. అలాగే రూ.2 లక్షల స్వీయ భద్రతా బాండ్ అమలు చేయించారు.

అయితే బైండోవర్‌లో ఉన్నప్పటికీ సదరు వ్యక్తి మరోసారి నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో బైండోవర్ నిబంధనల ఉల్లంఘన విషయాన్ని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు పోలీసులు నివేదించారు.

బాండ్ ఉల్లంఘనపై నోటీసులు జారీ చేసి వివరణ కోరగా, బాండ్‌కు సంబంధించిన ష్యూరిటీ మొత్తాన్ని చెల్లించలేనని పేర్కొనడంతో పాటు సరైన వివరణ ఇవ్వడంలో విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బైండోవర్ అమలులో ఉన్నవారు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానాలు, డిటెన్షన్, జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

About Author

SSN