మానసిక ఆరోగ్య పరిరక్షణే ఆత్మహత్యల నివారణకు మార్గం – వన్ స్టాప్ సెంటర్ సేవలపై గ్రామస్థులకు అవగాహన
గూడూరు :
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న “నో సూసైడ్” అవగాహన కార్యక్రమాలలో భాగంగా జూన్ 20వ తేదీన గూడూరు మండలంలోని రామరాజుపాలెం గ్రామంలో గ్రామస్థులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది.
రామాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అర్చిష్మ, కేస్ వర్కర్ శ్రీమతి సుధారాణి, శ్రీమతి ప్రవీణ పాల్గొని ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నిర్వహణ, సానుకూల ఆలోచనా విధానం, కుటుంబ మరియు సామాజిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మార్గాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అర్చిష్మ మహిళలు, బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న వన్ స్టాప్ సెంటర్ సేవల గురించి వివరించారు. గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, కుటుంబ వివాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధిత మహిళలు, బాలికలు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పోలీసు సహకారం మరియు తాత్కాలిక ఆశ్రయ సేవలను పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన సమయంలో సహాయం పొందేందుకు వెనుకాడవద్దని, సమాజం మొత్తం కలిసి ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలు అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ 14416 మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్, 181 ఉమెన్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ మరియు 112 అత్యవసర సేవల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన పెంపొందించడం ద్వారా ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చని, సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని వక్తలు సూచించారు.

