పట్టణాల ప్రైవేటీకరణను ఆపాలి – ప్రజలపై భారాలు మోపొద్దు: సీపీఎం మచిలీపట్నం నగర కమిటీ డిమాండ్
మచిలీపట్నం:
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఓ. 673 ద్వారా పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ప్రజా సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే నిర్ణయం. ప్రమాదకర జీవో 673ను వెంటనే ఉపసంహా రించాలని సిపిఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బూర. సుబ్రహ్మణ్యం రాష్ట్ర కూటమి ప్రభుత్వంను డిమాండ్ చేశారు.
ఈసందర్బంగా బూర. సుబ్రహ్మణ్యం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు ప్రజల ప్రాథమిక హక్కులు. వీటిని ప్రైవేటీకరించడం వల్ల సేవల పేరుతో అధిక చార్జీలు వసూలు చేసి ప్రజలపై ఆర్థిక భారం మోపే ప్రమాదం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలపై మరిన్ని భారాలు మోపే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి. పట్టణ స్థానిక సంస్థలకు తగిన నిధులు, సిబ్బంది కేటాయించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.
జి.ఓ. 673ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పట్టణాల ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని సీపీఎం మచిలీపట్నం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ప్రజాసంఘాలను కలుపుకొని విస్తృత ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు చెప్పు. రాజేష్, సిపిఎం సినియర్ నాయకులు కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు.

