MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

ఆత్మహత్యల నిర్మూలనకు అవగాహన కార్యక్రమం – అవనిగడ్డ ప్రాజెక్ట్ పరిధిలో ఓరియంటేషన్ సదస్సు

  • June 19, 2026
  • 0 min read
ఆత్మహత్యల నిర్మూలనకు అవగాహన కార్యక్రమం – అవనిగడ్డ ప్రాజెక్ట్ పరిధిలో ఓరియంటేషన్ సదస్సు

అవనిగడ్డ:

మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ లక్ష్యంగా జూన్ 15 నుండి జూలై 15 వరకు నిర్వహిస్తున్న నెల రోజుల “నో సూసైడ్” అవగాహన మాసోత్సవాలలో భాగంగా, 2026 జూన్ 19వ తేదీన అవనిగడ్డ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో సూపర్వైజర్లు, సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఎం.ఎన్. రాణి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శ్రీమతి ప్రసన్న విశ్వనాథన్, వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి అర్చిష్మ హాజరై ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నిర్వహణ, సానుకూల ఆలోచనా విధానం మరియు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే అవసరమైన సమయంలో ప్రజలు ప్రభుత్వ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ, 14416 మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్, 181 ఉమెన్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 112 అత్యవసర సేవల గురించి వివరించారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన కల్పించడం ద్వారా ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చని, సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జి సీడీపీవో, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author

SSN