MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

యువతే దేశానికి బలం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – లక్ష్యంతో ముందుకు సాగితేనే జీవితంలో విజయం సాధ్యం

  • August 12, 2026
  • 0 min read
యువతే దేశానికి బలం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – లక్ష్యంతో ముందుకు సాగితేనే జీవితంలో విజయం సాధ్యం

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సులో డిఎల్ఎస్ఎ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి

మచిలీపట్నం:

యువత దేశానికి అమూల్యమైన ఆస్తి అని, యువతలో చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని దుర్వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఎ) చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయ సేవా సదన్ భవన్‌లో కృష్ణా జిల్లా డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని యువతకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రజలను చట్టబద్ధంగా వ్యవహరించేలా ప్రోత్సహించడం, తప్పుదోవ పట్టే పరిస్థితుల నుంచి వారిని రక్షించి సరైన మార్గంలో నడిపించడం డిఎల్ఎస్ఎ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో ముందంజలో ఉందని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత తమ శక్తి, ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు.

ప్రస్తుతం యువతను ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగం, ఇతర దుర్వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాలు ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అసాంఘిక శక్తులు యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు దేశ భవిష్యత్తుపైనా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ స్నేహితులు, సహచరుల ప్రవర్తనలో ఆకస్మికంగా మార్పులు కనిపించినా, వారి మాటతీరు, ఆలోచనా విధానం లేదా ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు గమనించినా నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ వంటి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, పిల్లలకు విద్య, ఫీజులు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ కార్యకలాపాలను కూడా తల్లిదండ్రులు శ్రద్ధగా గమనించాలని సూచించారు. పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం గడిపి వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైనప్పుడు స్నేహపూర్వకంగా సూచనలు చేస్తూ సరైన మార్గంలో నడిపించాలని అన్నారు. మత్తు పదార్థాల సమస్యను కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల బాధ్యతగా భావించకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమష్టిగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువతను రక్షించేందుకు సమాజంలోని ప్రతి వర్గం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

యువత ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. “గురి లేని జీవితం వృథా” అని పేర్కొంటూ, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగాలని చెప్పారు. జీవితంలో ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించుకుని, ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతరం కృషి చేయాలని యువతకు సూచించారు. యువత తమ ఆలోచనలు, స్నేహాలు, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి మార్గాన్ని ఎంచుకోవాలని, తమ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో, వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రం, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో పదవ అదనపు జిల్లా జడ్జి సిహెచ్. దుర్గా పూర్ణిమ, కృష్ణా జిల్లా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఓ.వి. నాగేశ్వరరావు, పోక్సో కోర్టు న్యాయమూర్తి జి. వెంకటేశ్వర్లు, కృష్ణాజిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్ .వరలక్ష్మి, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN