నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణా జిల్లా పోలీస్ – అర్ధ సంవత్సర క్రైమ్ రివ్యూ మీటింగ్
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2026 జనవరి నుంచి జూలై వరకు నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల కేసులు, రౌడీ–సస్పెక్ట్ షీటర్ల బైండ్‌ఓవర్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ అధికారులతో అర్ధ సంవత్సర క్రైమ్ రివ్యూ మీటింగ్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో లాంగ్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు 30 శాతం తగ్గినప్పటికీ, మిగిలిన కేసులపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
జిల్లాలో గ్రేవ్ కేసుల డిటెక్షన్ శాతం 2025లో 92.54 శాతం ఉండగా, 2026 జనవరి–జూలైలో 94.74 శాతానికి పెరిగిందని, ఈ పనితీరును మరింత మెరుగుపరచాలని తెలిపారు. జిల్లాలో రౌడీ షీటర్ల బైండ్‌ఓవర్ 80.6 శాతం ఉండగా, సస్పెక్ట్ షీటర్ల బైండ్‌ఓవర్ 66.2 శాతంగా ఉన్నందున సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 2026 జనవరి–జూలైలో మిస్సింగ్ కేసుల మొత్తం ట్రేసింగ్ శాతం 90.37గా నమోదైందని, 48 గంటల్లో ట్రేసింగ్‌పై కూడా మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సూచించారు. NDPS కేసుల్లో నిందితులపై చట్టపరమైన చర్యలతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే మూలాలను గుర్తించి నెట్‌వర్క్‌ను ఛేదించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 2026 జనవరి–జూలైలో NDPS కేసులు 24 నమోదయ్యాయన్నారు.
జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ , ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

