ఈ నెల 23న సేవ్ హాస్పిటల్ వద్ద ఉచిత వైద్య శిబిరం
మచిలీపట్నం:
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని సాయిబాబా గుడి సమీపంలోని సేవ్ హాస్పిటల్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించ నున్నట్లు ఏపీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఆర్. ఆంజనేయులు తెలిపారు.
వంగవీటి మోహనరంగా ఆశయాలను కొనసాగిస్తూ, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాన్ని వంగవీటి ఆశా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు.
శిబిరంలో పేదలకు గుండె పరీక్షలు, మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, దంత పరీక్షలు, కంటి పరీక్షలు తదితర వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు, డా. కొండిశెట్టి సురేష్‌బాబు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

