బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
చల్లపల్లి గురుకుల పాఠశాలలో చైతన్యం అవగాహన సదస్సు
చల్లపల్లి:
విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే కృష్ణాజిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “చైతన్యం” అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగరానాయుడు తెలిపారు. చల్లపల్లి గురుకుల పాఠశాల, కళాశాలలో సోమవారం చైతన్యం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు బాలికలను చట్టప్రకారం పిల్లలుగానే చూస్తామనీ, ఫోక్సో చట్టం బాలికలకు రక్షణ కల్పిస్తుందనీ, చట్టాలపై ప్రతి విద్యార్థినీ అవగాహన కలిగి ఉండాలన్నారు. 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1098 చైల్డ్ హెల్ప్లైన్స్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
సోషల్మీడియా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, పొగడ్తలకు ప్రలోభపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. చెప్పుడు మాటలు వినటం, ప్రేమిస్తున్నామంటూ ప్రలోభాలకు గురిచేస్తే తొందరపడవద్దనీ, ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు తల్లిదండ్రులు, గురువులకు చెప్పాలనీ, మంచి చెడులు తెలుసుకోవాలని చెప్పారు. చదువుతో ఉన్నతస్థానానికి ఎదగాలనీ, మంచి నడవడిక, వ్యక్తిత్వంతో మెలగాలనీ, లక్షా ్యలను నిర్దేశించుకుని జీవితంలో రాణించాలన్నారు. ఆడపిల్లలు ఉన్నతస్థానానికి ఎదిగితే వారితోపాటు కుటుంబమూ ఉన్నతస్థానానికి చేరుకుంటుందన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలు పెద్దవాళ్లం అయిపోయామని పెళ్లి గురించి ఆలోచన చేయవద్దని సూచించారు. ఉన్నతస్థానంలో ఉన్న ప్రముకులను స్పూర్తిగా తీసుకుని ఎదగాలనీ, పేదరికం విజయాన్ని ఆపలేదని తెలిపారు. శక్తియాప్ గురించి అవగాహన కలిగిఉండాలని యాప్ వినియోగం గురించి తెలిపారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో దూరంగా ఉండాలని సూచించారు.
అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ, పురుషులతో ఏమాత్రం తీసిపోము, అందరూ సమానమే అన్న భావన ప్రతి విద్యార్థినిలోనూ ఉండాలన్నారు. స్ఫూర్తివంతమైన మహిళలను ఆదర్శంగా తీసుకుని వారి గురించి తెలుసుకోవాలని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటూ పోటీతత్వంతో విద్యలో రాణించాలన్నారు.
ఐసీడీఎస్ సీడీపీవో ప్రసన్న విశ్వనాధ, చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు, ఘంటసాల ఎస్ఐ వేమన చందనలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్యీవో పి. వెంకటేశ్వరరావు, సీఐలు వి.వెంకటేశ్వరరావు, సత్యకిషోర్, ఎస్ఐలు డి.దుర్గాంజనేయులు, గౌతంకుమార్, ప్రిన్సిపాల్ అరుణకుమారి, సూపర్వైజర్ సిహెచ్. ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటి నీరుపోశారు.


