MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు

  • August 16, 2026
  • 0 min read
స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు

మచిలీపట్నం:

స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా, ఆదివారం మచిలీపట్నం ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తోందన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లచ్చన్న చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

సామాన్య కుటుంబంలో జన్మించిన లచ్చన్న చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం అనుభవించారని మంత్రి తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా సమాజంలోని అసమానతలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై చట్టసభల్లో నిర్మొహమాటంగా తన గళాన్ని వినిపించారని పేర్కొన్నారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వ దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లిన ఘనత లచ్చన్నకే దక్కుతుందన్నారు. తీర ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తుచేశారు. బీసీలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

బీసీల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు

బీసీల అభ్యున్నతి, రాజ్యాధికార సాధన కోసం లచ్చన్న నిరంతరం కృషి చేశారని, మురళీధరరావు కమిషన్, మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు కూడా ఆయన పోరాడారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించిన లచ్చన్న, తన గురువు ఆచార్య ఎన్.జి. రంగా కోసం తన పదవిని త్యాగం చేసి ఆయనను పార్లమెంట్‌కు పంపిన సంఘటన ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.

రాజకీయాల్లో ఉన్నంతకాలం నిజాయితీ, నీతి, ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేసిన లచ్చన్న అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. తాను రాజకీయంగా ఎదగడానికి లచ్చన్న స్ఫూర్తి, మార్గదర్శకత్వం ఎంతో దోహదపడిందని కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.

కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి రమేష్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీమ్ బేగ్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, కూటమి నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య), మాదివాడ రాము, లోగిశెట్టి వెంకటస్వామి, లంకే శేషగిరిరావు, గడ్డం రాజు, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN