విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలి – గోపు సత్యనారాయణ
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు
మచిలీపట్నం:
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కానూరు పంచాయతీ పరిధిలోని జి.కానూరు, పెద్దకానూరు, వన్నారు కానూరు తదితర గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.
వన్నారు కానూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది గోపు సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని నింపే పవిత్రమైన రోజు స్వాతంత్య్ర దినోత్సవమన్నారు. 1947 ఆగస్టు 15న సుమారు 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు దేశ చరిత్రను తెలుసుకుని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దేశం పట్ల ప్రేమ, బాధ్యత, సేవాభావం ప్రతి విద్యార్థి జీవితానికి మార్గదర్శకంగా నిలవాలని, త్రివర్ణ పతాకం ఎగురుతున్న ప్రతిసారీ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగాలని అన్నారు.
ఈ సందర్భంగా గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో 550 మార్కులు సాధించిన గణపబత్తుల తిరువెంకట లక్ష్మికి రూ.10,000 నగదు బహుమతిని అందజేశారు. రెండో ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున, మూడో ర్యాంకు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నగదు పురస్కారాలు అందించారు. విద్యార్థులను అభినందిస్తూ వారి భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్, గోపు ప్రతాప్, నరేష్కుమార్ (పీఏసీఎస్ అధ్యక్షుడు), గోపు నగేష్, పీత రాము, దివి మహేష్, గోపు వెంకటరమణ, బొల్లిశెట్టి శివనాగరాజు, చిటికినేటి అయ్యప్ప, బొమ్మిడి పెద్ద ఏడుకొండలు, ఈవన సత్యనారాయణ, మోకా శ్రీను, గణపబత్తుల నాగపాము, కమ్మగట్టి అశోక్, వీర చిన్న, గోపు కనకపెద్దిరాజులు, శేరు నరసింహం, పిచ్చయ్య, పెదసింగు వెంకటరమణ, మోకా నాగరాజు, చితికినేటి సీతారామయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

