MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

రైతు బజార్లు, కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం పంపిణీ – కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్

  • November 12, 2026
  • 1 min read
రైతు బజార్లు, కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం పంపిణీ – కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం కలెక్టరేట్‌లోని PGRS మీటింగ్ హాల్‌లో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ అధ్యక్షతన జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, డిస్ట్రిక్ట్ మేనేజర్ (పౌర సరఫరాలు), రైస్ మిల్లర్లు, హోల్ సేల్ రైస్ ట్రేడర్స్ మరియు CS DTలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భాగంగా జిల్లాలోని 10 రైతు బజార్లు మరియు 30 రైస్ మిల్లు పాయింట్ల వద్ద కౌంటర్ల ద్వారా రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే BPT బియ్యం విక్రయాలు ప్రారంభించబడినట్లు అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని విరివిగా సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 17,432 మంది రేషన్ కార్డుదారులకు BPT స్టీమ్ 1648.51 క్వింటాళ్లు మరియు BPT రా (raw) 1788.53 క్వింటాళ్ల బియ్యం విక్రయాలు జరిగినట్లు తెలిపారు.

బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో, పేద ప్రజలకు ఊరట కల్పించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ కార్యక్రమం కింద BPT రకం బియ్యం కిలో రూ. 49/- చొప్పున, KNM రకం బియ్యం కిలో రూ. 50/- చొప్పున విక్రయిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా 26 కేజీల బియ్యం అందించబడుతోందని, ఇప్పటివరకు 1,959 మంది వినియోగదారులకు 516.10 క్వింటాళ్ల KNM రకం మరియు 68.90 క్వింటాళ్ల BPT రకం కలిపి మొత్తం 585 క్వింటాళ్ల బియ్యం విక్రయించబడిందని అధికారులు వివరించారు.

మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు బియ్యం విక్రయించినా, అనధికారికంగా అక్రమ నిల్వలు ఉంచినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించి 19 కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించినట్లు స్పష్టం చేశారు.

అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో రైస్ మిల్లర్లు అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. తగినంత బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించడంతో పాటు గన్ని బ్యాగులు లేదా ట్రాన్స్‌పోర్ట్ పరంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతు బజార్లలో ధరణి బియ్యం విక్రయాలు నిరంతరం సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తూ, తగిన నిల్వలు అందుబాటులో ఉంచి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

About Author

SSN