MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

నిరుద్యోగ యువతకు శుభవార్త: కృష్ణా జిల్లాలో 192 ఇంటర్న్‌షిప్ అవకాశాలు

  • November 12, 2026
  • 1 min read
నిరుద్యోగ యువతకు శుభవార్త: కృష్ణా జిల్లాలో 192 ఇంటర్న్‌షిప్ అవకాశాలు

 * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ప్రకటన

 * 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన యువతకు సువర్ణావకాశం

 * నెలకు రూ. 9,000 స్టైపెండ్‌తో పాటు రూ. 6,000 వన్-టైమ్ గ్రాంట్

మచిలీపట్నం :

కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు, వివిధ రంగాల్లో పని అనుభవం కల్పించేందుకు ప్రముఖ సంస్థల్లో మొత్తం 192 ఇంటర్న్‌షిప్ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ప్రకటించింది. ఫైనాన్స్, బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, సేల్స్, కస్టమర్ సపోర్ట్, స్టాక్ మార్కెట్ మరియు లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం పొందేందుకు 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాను కిరణ్ జారుగు & కో సంస్థలో బీకాం అర్హతతో ‘టాక్సేషన్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్’ పోస్టులు 2 (ఇంటర్న్‌షిప్ ID: PMIS-2026-87644), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) లో బీకాం అర్హతతో ‘ఫ్రంట్‌లైన్ ఆపరేషన్స్’ పోస్టులు 5 (ID: PMIS-2026-83555), ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఏదైనా డిగ్రీ అర్హతతో ‘ఇంటర్న్‌షిప్ ట్రైనీ’ పోస్టులు 50 (ID: PMIS-2026-88593) మరియు టీసీఐ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో ఇంటర్మీడియట్ అర్హతతో ‘అసిస్టెంట్ హబ్ ఆపరేషన్స్’ పోస్టులు 5 (ID: PMIS-2026-90304) ఉన్నాయి. వీటన్నింటికీ ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 6 నెలలుగా నిర్ణయించారు. వీటితో పాటు పదో తరగతి అర్హత, 9 నెలల కాలవ్యవధితో పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ‘సేల్స్ అండ్ సపోర్ట్’ విభాగంలో 30 ఖాళీలు (ID: PMIS-2026-92500), ‘ఆయిల్ అండ్ గ్యాస్ సేల్స్ ట్రైనీ’ విభాగంలో 100 ఖాళీలు (ID: PMIS-2026-88702) అందుబాటులో ఉన్నాయి.

ఈ ఇంటర్న్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తరపున నెలకు రూ. 9,000/- స్టైపెండ్‌తో పాటు, అదనంగా వన్-టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ. 6,000/- ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వ ధృవీకరణ పత్రం (సర్టిఫికెట్) కూడా లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://pminternship.mca.gov.in/ వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాను ఎంచుకుని గరిష్టంగా 3 ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అభ్యర్థులు ఇంటర్, పదో తరగతి అర్హత గల పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ (OTP వెరిఫికేషన్ కోసం) మరియు విద్యార్హత సర్టిఫికెట్ల PDF ఫైళ్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం తెలియని అభ్యర్థులు https://tinyurl.com/3249aaae లింక్ ద్వారా తమ వివరాలు నమోదు చేస్తే, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బందే స్వయంగా సంప్రదించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. మరిన్ని వివరాల కోసం 8897772488 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

About Author

SSN