కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘అంతర్జాల భద్రత’పై అవగాహన సదస్సు
మచిలీపట్నం:
నూతన జాతీయ విద్యా విధానం (NEP 2020)లో భాగంగా “అంతర్జాలంలో భద్రత, అప్రమత్తంగా వ్యవహరించటం” అనే అంశంపై కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన కంప్యూటర్ సైన్స్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఆర్. విజయకుమారి మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో అంతర్జాలంలో జరుగుతున్న ఆర్థిక మోసాల తీరును విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా సామాజిక మాధ్యమాలలో యువత తమని తాము ఎలా పరిరక్షించుకోవాలో పలు ఉదాహరణలతో అవగాహన కల్పించారు.
సైబర్ మోసాల నివారణకు 10 ప్రాథమిక సూత్రాలు
అంతర్జాల వినియోగంలో విద్యార్థులు, యువత మోసాలకు గురికాకుండా ఉండటానికి డాక్టర్ ఆర్. విజయకుమారి 10 ప్రాథమిక సూత్రాలను పరిచయం చేశారు. వ్యక్తిగత సమాచారం, ఓటీపీ వివరాలు, తెలియని లింకులపై క్లిక్ చేయడం వంటి అంశాలలో అప్రమత్తత అత్యవసరమని ఆమె సూచించారు. సామాజిక మాధ్యమాలలో గోప్యతా సెట్టింగ్‌లను పకడ్బందీగా ఉంచుకోవడం, బలమైన పాస్‌వర్డ్‌లను వినియోగించడం వంటి జాగ్రత్తల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో డా. సల్మా బేగంతో పాటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.

