కార్తీక పౌర్ణమి భక్తులకు శుభవార్త.. మంగినపూడి బీచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మచిలీపట్నం:
కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం మచిలీపట్నం మంగినపూడి బీచ్‌కు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 24న (మంగళవారం) జరగనున్న కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, రేపటి నుంచి అంటే నవంబర్ 22వ తేదీ (ఆదివారం) నుంచే ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO) కొడమంచిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా పరిధిలోని అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం మరియు ఉయ్యూరు డిపోల నుంచి నేరుగా మంగినపూడి బీచ్ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటితో పాటు స్థానిక ప్రయాణీకుల కోసం మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి బయలుదేరి, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మంగినపూడి బీచ్ వరకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు తిరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సముద్ర స్నానాలకు వెళ్లే భక్తులు, ప్రయాణీకులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ కల్పించిన ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీపీటీవో కోరారు.

