MachilipatnamLocal News
July 20, 2026
జిల్లా

12,456.77 కోట్ల వ్యాపారం, ₹82 కోట్ల నికర లాభంతో రాష్ట్రంలో అగ్రగామిగా కేడీసీసీ బ్యాంక్: చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం

  • June 29, 2026
  • 1 min read
[addtoany]
12,456.77 కోట్ల వ్యాపారం, ₹82 కోట్ల నికర లాభంతో రాష్ట్రంలో అగ్రగామిగా కేడీసీసీ బ్యాంక్: చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం

జిల్లా స్థాయి సహకార స్థిరీకరణ నిధి (డి ఎల్ ఎస్ ఎఫ్) గ్రాంట్ కింద ₹4.43 కోట్ల మంజూరుకు సర్వసభ్య సమావేశం ఆమోదం

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీ బ్యాంక్) 2026-27 వార్షిక సర్వసభ్య సమావేశం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో వార్షిక నివేదిక, ఆడిట్ నివేదిక, ఆర్థిక ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ, సహకార సంఘాల బలోపేతానికి సంబంధించిన పలు కీలక తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ, రైతు సంక్షేమం, సహకార రంగ అభివృద్ధి, పారదర్శక పాలన, సభ్యులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలందించడమే కేడీసీసీ బ్యాంక్ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో వ్యవసాయం, పాడి, మత్స్య, పౌల్ట్రీ, ఉద్యానవనం, మహిళా స్వయం సహాయక సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతతో రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పీఎంఈజీపి పిఎం సూర్యఘర్, వ్యవసాయ అనుబంధ రంగాలు, స్వయం ఉపాధి పథకాల కింద భారీగా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రత్యేక రుణాలు, విద్యార్థులకు విద్యా రుణాలను కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

2015కు ముందు రుణాలు పొంది వివిధ కారణాలతో చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓ టి ఎస్) అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3 లక్షల వరకు పంట రుణాలు తీసుకుని మరణించిన అప్పుదారుల కుటుంబాలకు వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానించినట్లు వెల్లడించారు. బ్యాంకు విస్తరణలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో , వెలటూరు శాఖను ప్రారంభించామని, సేరి లక్ష్మీపురం రెడ్డిగూడెం శాఖలను ప్రారంభిస్తామని భవిష్యత్తులో ఊటుకూరు, మీర్జాపురం, చిల్లకల్లు, సింగరాయపాలెం ప్రాంతాల్లో కూడా నూతన శాఖల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడానికి మూడు మొబైల్ బ్యాంకింగ్ వాహనాలు, మొబైల్ యాప్, యూపీఐ, క్యూ ఆర్ చెల్లింపులు వంటి డిజిటల్ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. 2022-27 వేతన ఒప్పందాన్ని అమలు చేసి రాష్ట్రంలోనే తొలిసారిగా ఏరియర్స్‌తో సహా ఉద్యోగులకు పెరిగిన వేతనాలు చెల్లించిన జిల్లా సహకార బ్యాంక్ కేడీసీసీ బ్యాంకేనని చైర్మన్ గర్వంగా పేర్కొన్నారు. అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు మరియు ఉద్యోగులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొంటూ,పి ఎసిఎస్ బలోపేతం కాకుండా రైతు సంక్షేమం సాధ్యం కాదన్నారు. ప్రతి సంఘం రైతులకు నమ్మకమైన ఆర్థిక భాగస్వామిగా నిలవాలని సూచించారు. రుణాల పంపిణీతో పాటు వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 100 శాతం రుణ వసూళ్లు సాధించే సంఘాలే ఆదర్శ సహకార సంఘాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాబ్, నాబార్డ్ మార్గదర్శకాల మేరకు పిఎసిఎస్ లను కంప్యూటరీకరణ, కోర్ బ్యాంకింగ్, యూపీఐ క్యూఆర్ చెల్లింపులు వంటి ఆధునిక సాంకేతిక సేవలతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. రైతులు గ్రామాన్ని విడిచి వెళ్లకుండా తమ సహకార సంఘంలోనే అన్ని బ్యాంకింగ్ సేవలు పొందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ మార్గదర్శకాల మేరకు ఆర్థికంగా బలహీనంగా ఉన్న పిఎసిఎస్ లలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం జిల్లా స్థాయి సహకార స్థిరీకరణ నిధి (డి ఎల్ ఎస్ ఎఫ్) గ్రాంట్ కింద 4.43 కోట్ల మంజూరుకు సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం సహకార సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి మరింత భరోసా కల్పిస్తుందని చైర్మన్ పేర్కొన్నారు.

బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్ వార్షిక నివేదికను సభ ముందుంచి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 82 కోట్ల నికర లాభం నమోదు చేసిందని తెలిపారు. మొత్తం వ్యాపారం 12,456.77 కోట్లకు, డిపాజిట్లు 3,850.76 కోట్లకు, రుణాలు 8,606.01 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. వరుసగా ‘ఏ ‘ఆడిట్ క్లాసిఫికేషన్ కొనసాగిస్తూ ఆర్థిక క్రమశిక్షణ, రుణ వసూళ్లు, డిజిటల్ సేవల విస్తరణలో విశేష పురోగతి సాధించిందన్నారు.

ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట రామకృష్ణ మాట్లాడుతూ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం నాయకత్వంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే అత్యుత్తమ జిల్లా సహకార బ్యాంకులలో ఒకటిగా ఎదిగిందని ప్రశంసించారు. రైతు సంక్షేమం, పారదర్శక పాలన, ఆర్థిక క్రమశిక్షణలో కేడీసీసీ బ్యాంక్ ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఆప్కాబ్ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో 100 శాతం రుణ వసూళ్లు సాధించిన 61 సహకార సంఘాలు, చైర్‌పర్సన్లు, డైరెక్టర్లు, సీఈఓలు, ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.

చివరగా పలువురు పిఎసిఎస్అధ్యక్షులు మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్‌ను రాష్ట్రంలో ఆదర్శ సహకార బ్యాంకుగా తీర్చిదిద్దిన చైర్మన్ శ్రీ నెట్టెం శ్రీ రఘురాం నాయకత్వాన్ని కొనియాడుతూ, రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా చైర్మన్ నాయకత్వంలో బ్యాంక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు ప్రొఫెషనల్ డైరెక్టర్ మురళీధర్, ఆప్కాబ్ జనరల్ మేనేజర్ శ్రీమతి జమున, డి ఎల్ చంద్రశేఖర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, రంగబాబు, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) అధ్యక్షులు పాల్గొన్నారు.

About Author

SSN