బీచ్‌కు పర్యాటక శోభ తెచ్చేలా వినాయక చవితి వేడుకలు నిర్వహిద్దాం: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
బందరు చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటుగా, మంగినపూడి బీచ్‌కు పర్యాటక శోభ తెచ్చేలా వినాయక చవితి వేడుకలు మంగినపూడి బీచ్ వద్ద నిర్వహిద్దామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు మచిలీపట్నం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ ఇతర పుర ప్రముఖులతో కలిసి స్కూల్ అసోసియేషన్, కాలేజ్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జ్యూవెలర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిదులు, థియేటర్స్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, గోల్డ్ కవరింగ్ అసోసియేషన్, ఎలక్ట్రీషియన్ అసోసియేషన్, బార్ అసోషియేషన్ ప్రతినిధులు, విశ్వహిందు పరిషత్ ప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగినపూడి బీచ్ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న వినాయకచవితి ఉత్సవాలకు సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు.
వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్ వద్ద 63 అడుగుల భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో తిరుమల, శ్రీశైలం, కాణిపాకం, ఇంద్రకీలాద్రి, సింహాచలం, అయోధ్య దేవాలయాల నమూనా ఆలయాలు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. అదే సమయంలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత యువతకు నవరాత్రుల సమయంలో ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. ఆ మేరకు ఈ ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా వసతుల లేమితో పర్యాటకులు స్థానికంగా ఉండడానికి ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఏపీఎండీసీ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు, కాఫీ కేప్ ఏర్పాటు చేస్తున్నాం. మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతను కూడా కాఫీ కేప్ నిర్వాహకులకే అప్పగిస్తున్నాం.
బీచ్ అభివృద్ధి కోసం మసులా బేపార్క్ కమిటీ కూడా ఏర్పాటు చేశాం. మరింత స్థలం అభివృద్ధి చేసి పర్యాటకులకు అన్ని రకాల వసతులు కల్పించాలి. గతంలో మసులా బీచ్ ఫెస్ట్ నిర్వహించాం. ఇప్పుడు వినాయక చవితి నిర్వహణతో ఈ ప్రాంతం రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించేలా చేద్దాం. ఈ మహా కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని రవీంద్ర సూచించారు.

