MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

రైతాంగ అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి కొల్లు రవీంద్ర

  • May 25, 2026
  • 0 min read
[addtoany]
రైతాంగ అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తూ రోడ్ల అభివృద్ధి, సాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

సోమవారం ఉదయం మంత్రి మచిలీపట్నం మండలం అరిసెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రైతాంగానికి అవసరమైన సాగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. మంత్రివర్గ ఆమోదంతో ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కింద కాలువల మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

సాగునీటి కాలువల మరమ్మతులకు రూ.1 కోటి 75 లక్షలు, డ్రైనేజీల మరమ్మతులకు రూ.1 కోటి 75 లక్షలు, అరిసేపల్లి కాలువ పనులకు రూ.6 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. బందరు సెక్షన్ పరిధిలో 17 పనులకు రూ.99.36 లక్షలు, నైన్త్ ఛానల్ పరిధిలో 11 పనులకు రూ.75 లక్షలు, మురుగునీటి కాలువల 32 పనులకు రూ.1 కోటి 75 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.

అదేవిధంగా బందరు పరిధిలో మొత్తం రూ.25 కోట్లలో భాగంగా ఇరిగేషన్ పనుల కోసం రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జొన్నలవారి మోడి సైఫన్‌కు రూ.1 కోటి, సాధారణ మరమ్మతులకు రూ.1 కోటి 50 లక్షలు, సముద్రపు నీరు రాకుండా డ్రైనేజ్ అవుట్ ఫాల్ స్లూయిస్ పనులకు రూ.1 కోటి, లంకపల్లి డ్రైన్ తవ్వకానికి రూ.20 లక్షలు, స్ట్రక్చర్ల మరమ్మతులకు రూ.1 కోటి 30 లక్షలు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ఈ నిధులతో తాళ్లపాలెం డ్రైన్, శివగంగ డ్రైన్, పోతిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎండాకాలంలోనే కాలువల పనులను పూర్తి చేసి, సాగునీరు విడుదల చేసే సమయానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పంట కోత అనంతరం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం చెల్లింపులు జమ అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పనుల నాణ్యత పర్యవేక్షణ కోసం రైతులు నీటి సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ పనుల్లో భాగస్వాములు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా అధిక వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దాని వాడకాన్ని తగ్గించాలని సూచించారు. రైతులకు అవసరమైన యూరియా, విత్తనాలు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ద్వారా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు ప్రభుత్వ రాయితీతో కూడిన జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారులు, కూటమి నాయకులు లంకె శేషగిరిరావు, మధు, కాగిత గోపాలరావు తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.

About Author

SSN