మచిలీపట్నం :
జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు వారి తరఫున ప్రతి పోలింగ్ కేంద్రానికి బూతు స్థాయి ఏజెంట్లను వచ్చే సమావేశంలోగా అన్ని నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో నియమించాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ఆయా పార్టీల ప్రతినిధులకు సూచించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1769 పోలింగ్ కేంద్రాలకు గాను తెలుగుదేశం పార్టీ1710 మందిని బూత్ స్థాయి ఏజెంట్లను నియమించిందని, ఇంకా మచిలీపట్నం గుడివాడ గన్నవరం నియోజకవర్గాల్లో కొంతమందిని నియమించాల్సి ఉందన్నారు. అలాగే వైఎస్ఆర్సిపి 1233 మంది ఏజెంట్లను నియమించిందని, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గంలలో ఇంకా ఎవరిని నియమించలేదన్నారు. బిజెపి ఒక్క అవనిగడ్డలో మాత్రమే 21 మంది ఏజెంట్లను నియమించిందన్నారు. జనసేన పార్టీ అవనిగడ్డలో పూర్తిస్థాయిలో బిఎల్ఏ లను నియమించిందన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్, సిపిఐ ఎం, బి ఎస్ పి పార్టీలు ఇంకా ఎవరిని ఏజెంట్లుగా నియమించలేదన్నారు.
వచ్చే సమావేశంలోగా అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. వాటి జాబితాను సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల జాబితా నమోదు అధికారికి(ఈ ఆర్ ఓకు) పంపించాలన్నారు.
భారత ఎన్నికల సంఘం బూతు స్థాయి ఏజెంట్లకు త్వరలో శిక్షణ ఇవ్వనుందన్నారు.
అప్పుడే వారు బూత్ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి తోడ్పడతారన్నారు.
బూతు స్థాయి ఏజెంట్లను నియమించకుండానే ఫిర్యాదులు తీసుకోమని స్పష్టం చేశారు.
జిల్లాలో ఫారం 6, 7, 8 క్లెయిములకు సంబంధించి మొత్తం 86,313 దరఖాస్తులు అందగా అందులో 84,354 పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 1959 దరఖాస్తులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు.
జిల్లాలో 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాతో ప్రత్యేక తీవ్రతర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)మ్యాపింగ్ 69 శాతంబిపూర్తి చేశామన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, టిడిపి, ఐ ఎన్సి, బిజెపి, సిపిఎం, బి ఎస్ పి, వైఎస్ఆర్సిపి పార్టీల ప్రతినిధులు దాస్, మతిన్ ఖాన్, పివీ గజేంద్ర రావు, కొడాలి శర్మ.. రాజేష్, బాలాజీ…ఉపేంద్రనాథ్, సిలార్ దాదా…బాషా, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.