[addtoany]
మచిలీపట్నం :
ప్రజల నుండి స్వీకరిస్తున్న మీకోసం అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, సర్వ శిక్ష ఏపీసీ కుమిదిని సింగ్, డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక…. మీ కోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 132 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
మచిలీపట్నం నగరానికి చెందిన మహమ్మద్ బర్కతుల్లా అర్జీ అందజేస్తూ తన సతీమణి షకీలా పేరు మీద టిడ్కో ఇళ్ల ఫ్లాటు 4 వ అంతస్తులో ఇచ్చారని, ఆమె ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేస్తూ కింది అంతస్తులో ప్లాటు కేటాయించవలసినదిగా కోరారు.
మచిలీపట్నం చిలకలపూడి కి చెందిన కల్లేపల్లి సీతామహాలక్ష్మి తన ఎదురింటి వారు అయిన తిరువూరు లంక రామశాస్త్రి తన ఇంటికి కట్టుకున్న ప్రహరీని జరిపి కడతానని, తన అంతు చూస్తానాని బెదిరిస్తున్నారని, తమ ఇంటి ముందు ఉన్న పోరంబోకు స్థలమును కబ్జా చేయడానికి సిద్ధమవుతున్నాడని ఫిర్యాదు చేస్తూ పోరంబోకు స్థలాన్ని కబ్జా చేయకుండా కాపాడమని, తనను బెదిరించకుండా న్యాయము చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
గత సంవత్సరంలో సంభవించిన మొంతా తుఫాను నష్టపరిహారాన్ని ఈరోజు వరకు సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదని, అకాల భారీ వర్షాలు కురిసి వరద నీరు మైనరు, మేజరు మురికి కాలువలలో పూడిక స్తంభించిపోయి పంట పొలాల్లో కి ప్రవహించి ముంపుకు గురవుతున్నాయని, నీటిలో మునగటం వలన పంట నష్టం జరుగుతుందనీ,, ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఏప్రిల్, మే నెల ఆఖరి లోపల పూడికలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని , కోడూరు, పాలకాయ తిప్ప ప్రాంతంలోని కరకట్ట వద్ద కొన్ని సంవత్సరాలుగా పనిచేయునటువంటి రెండు స్లూయిస్ లను వెంటనే మరమ్మతులు చేయించి 5 వేల ఎకరాలను ముంపు బారి నుంచి కాపాడాయులని, 22 – ఏ లో షరతులు గల పట్టా భూములు సుమారు 10 వేల ఎకరాలు నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరుతూ కృష్ణా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, సభ్యులు ఆకుల బసవయ్య, ఉల్లీ శేషగిరిరావు తదితరులు అర్జీ అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షిస్తూ మీకోసం అర్జీలపై కొంతమంది అధికారులు సరైన ఎండార్స్మెంట్ ఇచ్చినప్పటికీ ఆన్లైన్లో ఎంపిక చేసే ఐచ్చికం సరిగా లేకపోవడంతో సమస్య వస్తుందని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారిలో మార్పు రాకపోవడం సరైనది కాదన్నారు. ఇకనైనా పనితీరు సరి చేసుకోకపోతే షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని హెచ్చరించారు.
ఈనెల 17వ తేదీన రాష్ట్ర ఎస్. సి.కమిషన్ జిల్లాకు రానుందని రిజర్వేషన్ నియమ నిబంధనలు వారు చర్చిస్తారని కొంతమంది అర్జీలు కూడా ఇచ్చే అవకాశం ఉందని, అధికారులు వారి పరిధిలో ఇదివరకే ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, సంబంధిత నివేదికలు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారికి వెంటనే పంపించాలన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను చెత్తరహిత ప్రదేశాలుగా తీర్చిదిద్దాలన్నారు.
వాటిల్లో ఇంకుడు గుంతలు, కాంపోస్టు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలోని అన్ని మంచినీటి జలాశయాలను 15 రోజులకు ఒకసారి బ్లీచింగ్ తో పరిశుభ్రం చేయాలన్నారు.
సంబంధిత రిజిస్టర్ లో చుట్టుపక్కల నివసించే వారి చేత సంతకం తీసుకోవాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేసి రిజిస్టర్ను పరిశీలించాలన్నారు. ఆ విధంగా చేయడం వలన మంచినీరు కలుషితం కాకుండా ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తానన్నారు.
ప్రతి ప్రభుత్వ అధికారి వారికి కేటాయించిన విధులను సజావుగా నిర్వహించాలన్నారు
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కాకుండా ఇతరత్రా డబ్బు ఎవరైనా అడిగితే వెంటనే 90631 51600 నంబరుకు వాట్సప్ సందేశం పంపాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
అన్ని మండల ప్రత్యేక అధికారులు వచ్చే శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పర్యవేక్షించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు విద్యాసంస్థలు సందర్శించి అక్కడ కంపోస్ట్ గుంతలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారా లేదా గమనించాలన్నారు .అలాగే మంచినీటి పరీక్ష పరికరాలను ఇవ్వడం జరిగిందని వాటిని వాడుతున్నారా లేదా కూడా పరిశీలించాలన్నారు.
సమాచార హక్కు చట్టం సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం కానీ సమాధానాలు పంపడం గాని ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 62 ప్రభుత్వ శాఖలకు గాను కొన్ని ప్రభుత్వ శాఖలు మాత్రమే పూర్తిస్థాయిలో ఆన్లైన్లో లాగిన్లు సిద్ధం చేశారన్నారు. మిగిలిన అధికారులు కూడా వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించి లాగిన్లు పూర్తి చేయాలన్నారు
మీకోసం అర్జీలను పరిష్కరించడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 10 మంది అధికారులను గుర్తించి జిల్లా కలెక్టర్ వారిని అభినందిస్తూ బహుమతులను అందజేశారు.
అందులో ఉంగుటూరు, బాపులపాడు, మొవ్వ, ఉయ్యూరు తహసీల్దారులు, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపల్ కమిషనర్, ఉంగుటూరు ఎంపీడీవో, గన్నవరం ఎస్డిపిఓ,, అవనిగడ్డ పంచాయతీరాజ్ డీఈఈ, పౌరసరఫరాల సంస్థ డిఎం, పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సంక్షేమ వసతి గృహాల కోసం మంచినీటి పరీక్ష పరికరాలను జిల్లా ఎస్సీ సంక్షేమ అధికార అధికారి షాహిద్ బాబుకు, డి టి డబ్ల్యూ ధూర్జటి ఫణికి పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డ్వామా, డి ఆర్ డి ఏ. పి డి లు శివ ప్రసాద్, హరిహరనాథ్, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు సోమశేఖర్, రమణ రావు డీఎస్ఓ మోహన్ బాబు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, డిటిడబ్ల్యు ధూర్జటి ఫణి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

