ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం కార్యక్రమంకు 119 అర్జీలు
మచిలీపట్నం :
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్ డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
కలెక్టరేట్లో మొత్తం 119 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
పెడన మండలం పుల్లపాడు గ్రామానికి చెందిన గూడవల్లి వెంకటేశ్వరరావు తనకు 60 సంవత్సరాలు పూర్తయ్యాయని క ఒకటిన్నర సంవత్సర కాలం నుండి దరఖాస్తు చేసిన పింఛను రావడంలేదని తనకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని తనకు పింఛను వచ్చేలా తగు సహాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
చల్లపల్లి మండలం లక్ష్మీపురం రామానగరంకు చెందిన పేరుబోయిన భాగ్యరాజు తనకు 60 సంవత్సరాల వయసు పూర్తయిందని, రోజువారి వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వాడనని, తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉందని తనకు కూడా షుగర్ బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో కూలి పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. తన కుటుంబ పోషణకు చాలా ఇబ్బంది పడుతున్నానని, తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

2 సంవత్సరాల పూర్తి… నూతన ఆవిష్కరణలు
అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి త్వరలో రెండు సంవత్సరాలు కావస్తున్న దృష్ట్యా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రూపొందించిన నూతన ఆవిష్కరణల కు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని వాటిని పొందుపరుస్తూ గ్రీటింగ్ కార్డులు తయారు చేయవలసి ఉందన్నారు.
అసంపూర్తి భవనాల ప్రతిపాదనలు ఈనెల 25 లోగా అందజేయాలి
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో 50 శాతం పూర్తయి అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలకు సంబంధించి అవసరమైన నిధుల అంచనాలతో ప్రతిపాదనలు ఈనెల 25వ తేదీలోగా అందజేయాలని తప్పనిసరిగా అందజేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నిధులు కేటాయింపుకు సుముఖత వ్యక్తం చేశారని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు.
నిధులు అవసరం లేని వారు వారి పరిధిలో ఎలాంటి అసంపూర్తి భవనాలు లేవని ధృవీకరణ పత్రం అందజేయాలన్నారు. ఇందుకోసం సిపిఓ నోడల్ అధికారిగా వ్యవహరించాలని ఇంజనీరింగ్ విభాగపు అధికారులందరూ అంచనాలు రూపొందించడంలో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు సహకారం అందించాలన్నారు.

వాట్సాప్ సూచనలపై తగిన చర్యలు
జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూపులో తాను పంపించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పంపించిన సూచనలను పాటించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై త్వరలో సమీక్షించడం జరుగుతుందన్నారు.
మార్కెట్ యార్డులో పుట్టగొడుగుల యూనిట్
పుట్టగొడుగుల యూనిట్ నెలకొల్పుటకు ముందుకు వచ్చిన వారికి వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థలం కేటాయించవచ్చని ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సంబంధిత వ్యాపారులు వెంటనే యూనిట్ నెలకొల్పుటకు కృషి చేయాలన్నారు.
ఈ ఆఫీస్ ద్వారా దస్త్రాలను పంపించాలి
వచ్చే వారం నుంచి అందరూ తనకు ఈ ఆఫీస్ ద్వారానే దస్త్రాలను పంపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక అంశానికి సంబంధించి ముందు ఒక దస్త్రం నడిపినప్పుడు ఆ తర్వాత అదే అంశంపై మరల దస్త్రం నడిపేటప్పుడు తాజాగా పంపకుండా ముందు దస్త్రానికి కొనసాగింపుగా పంపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఎస్ఈ లు సోమశేఖర్, రమణ రావు, డిపిఓ ఎం ధనలక్ష్మి, డ్వామా, డి ఆర్ డి ఏ. పి డి లు శివప్రసాద్ హరిహరనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, మార్క్ఫెడ్ డి ఎం మురళీ కిషోర్, ఐసీడీఎస్ పిడి ఎం ఎన్. రాణి, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

