తనిఖీలలో 10 కేజీల గంజాయి స్వాధీనం..
మచిలీపట్నం :
నగరంలోని ఇందిరమ్మ కాలనీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు సోమవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆర్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు ఆధ్వర్యంలో బృందాలు ఖాళీ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టగా, అక్కడ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 11 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు మచిలీపట్నం ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. గంజాయితో పట్టుబడిన 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు నగరంలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

