డిసెంబర్ 14, 15 తేదీల్లో మోపిదేవిలో ‘మన–2026’ సాంకేతిక, ఆవిష్కరణల ఉత్సవం
* పోస్టర్ను ఆవిష్కరించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
* 100కు పైగా పాఠశాలల విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శన, డ్రోన్ రేసింగ్ పోటీలు
* అటల్ టింకరింగ్ ల్యాబ్లను అన్ని పాఠశాలలకు అనుసంధానించాలని కలెక్టర్ ఆదేశం
మచిలీపట్నం:
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో కృష్ణా జిల్లా మోపిదేవిలో ‘మన–2026’ (మైండ్స్ ఆఫ్ ఆంధ్ర – నర్చరింగ్ ఆస్పిరెంట్స్) పేరుతో రాష్ట్రస్థాయి సాంకేతిక, ఆవిష్కరణల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో మోపిదేవిలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ప్లస్ పాఠశాల ప్రాంగణంలో ఈ వేడుక జరగనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన అధికారిక పోస్టర్ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన ‘స్కై స్పేస్’ సంస్థ సహకారంతో మోపిదేవి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ప్లస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఆకట్టుకోనున్న సాంకేతిక పోటీలు, ప్రాజెక్టులు
రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వందకు పైగా ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, రోబోటిక్స్, డ్రోన్లు, 3డీ ప్రింటింగ్, స్పేస్ టెక్నాలజీ, ఏరోమోడలింగ్ వంటి 8 ప్రధాన రంగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోనున్నారు. డ్రోన్ రేసింగ్, రోబో మిషన్, రోబో మేజ్ పోటీలతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా రాష్ట్రస్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన పోటీ నిర్వహిస్తున్నారు. ముగ్గురు విద్యార్థులతో కూడిన బృందాలు తమ ప్రాజెక్టులను సమర్పించవచ్చని, వీటిలో ఉత్తమ 10 ప్రాజెక్టులను ఎంపిక చేసి మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వాటికి నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్ల వినియోగంపై కలెక్టర్ ఆదేశాలు
పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖాధికారి (డీఈఓ)కి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఉన్న పది పాఠశాలలకు మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలలను అనుసంధానం (మ్యాపింగ్) చేయాలని సూచించారు. దీనివల్ల అన్ని పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక శిక్షణ, ప్రయోగాత్మక అభ్యాసంలో సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ ‘మన-2026’ ఉత్సవంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మోపిదేవి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ప్లస్ ప్రధానోపాధ్యాయురాలు పి. జయంతి, విజయవాడ స్కై స్పేస్ వ్యవస్థాపకులు, సీఈఓ ఇందుగు వేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ ఉత్సవాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సందర్శించవచ్చని, ఆసక్తి గలవారు www.mana2026.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

