మెగా డీఎస్సీ-2026 బీసీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ
మచిలీపట్నం:
డీఎస్సీ-2026 రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యే బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికారత అధికారి జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టెట్ (TET) ఉత్తీర్ణులైన బీసీ అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు బయోడేటాతో పాటు పదో తరగతి, టీటీసీ లేదా బీఈడీ మార్కుల జాబితా, టెట్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000 లోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను జతపరచి దరఖాస్తు సమర్పించాలి.
మచిలీపట్నంలోని కలెక్టరేట్ కాంపౌండ్, పోస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్న సంక్షేమ శాఖల సముదాయ భవనంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. ఇతర వివరాలకు 9154769111 ఫోన్ నంబర్‌లో లేదా నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని అధికారి తెలిపారు.

