MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

మంగినపూడిలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలు: కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష

  • September 9, 2026
  • 1 min read
మంగినపూడిలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలు: కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష

మచిలీపట్నం:

మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల ఎత్తైన మట్టి మహాగణపతిని ప్రతిష్టించి 14 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుండి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యమైన నిర్ణయాలు & ఆదేశాలు:

ట్రాఫిక్ కంట్రోల్ & ప్రత్యామ్నాయ రహదారి: గతంలో ఎదురైన రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – మంగినపూడి ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పష్టమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు.

భద్రత & గజ ఈతగాళ్లు: బీచ్‌లో భక్తులు సముద్రంలోకి వెళ్లకుండా పటిష్టమైన బారికేడ్లు కట్టాలని చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు.

పారిశుద్ధ్యం & నిరంతర వసతులు: 14 రోజుల పాటు ప్రాంగణంలో నిరంతర విద్యుత్, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీ, మున్సిపల్ సిబ్బందితో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి, తగినన్ని డస్ట్‌బిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: మచిలీపట్నం నుండి మంగినపూడి బీచ్‌కు ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు నడిపేలా చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు: భక్తులను అలరించేందుకు ప్రతిరోజూ సాయంత్రం స్థానిక కళాబృందాలు, కూచిపూడి కళాకారులు, నాటక సమాజాల భాగస్వామ్యంతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఫైర్ సేఫ్టీ: అగ్నిమాపక శాఖ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజన్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను కీలక ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ వి వి నాయుడు, బందరు ఆర్డిఓ కే సాంబశివరావు, కార్యక్రమ నోడల్ అధికారి డిఆర్డిఏ పీడీ హరిహరినాథ్, జెడ్పి సీఈవో డాక్టర్ జే అరుణ, డిపిఓ ఎం ధనలక్ష్మి, మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ దయాకర్, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, మెప్మా పీడీ సాయిబాబు, అగ్నిమాపక, మత్స శాఖాధికారులు ఏసురత్నం, అయ్యా నాగరాజా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, పర్యాటక శాఖ అధికారి జి రామలక్ష్మణరావు, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN