MachilipatnamLocal News
September 20, 2026
మచిలీపట్నం

సాగరతీరాన వినాయక వైభవం.. 63 అడుగుల విజయ గణపతి!

  • September 9, 2026
  • 1 min read
సాగరతీరాన వినాయక వైభవం.. 63 అడుగుల విజయ గణపతి!

11 రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు.. 630 కిలోల బందరు లడ్డు ప్రత్యేక ఆకర్షణ
పది లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

ప్రసిద్ధ మంగినపూడి సాగరతీరంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల మట్టి విజయ గణపతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక వేడుక ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై ఆయన ఉన్నతాధికారులు, ఉత్సవ కమిటీతో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 11 రోజుల పాటు సాగరతీరంలో ఆధ్యాత్మిక వేడుకలు కొలువుదీరుతాయని, దాదాపు 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఉత్సవాల్లో మచిలీపట్నం చారిత్రక వారసత్వానికి ప్రతీకగా 63 అడుగుల విజయ గణపతి చేతిలో ‘మల్లయ్య స్వీట్స్’ అధినేత గౌర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తయారుచేసిన 630 కిలోల భారీ బందరు లడ్డును ప్రతిష్ఠించడమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బందరు వైభవాన్ని పునఃప్రతిష్ఠించేలా రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చలమలశెట్టి నరసింహారావు, విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మద్దుల గిరీష్, ఉడత్తు కిషోర్ సహా పలువురు ప్రముఖులు, రెవెన్యూ, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం భారీ లడ్డు తయారీ బాధ్యతలు చేపట్టిన గౌర వెంకటేశ్వరరావును నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

About Author

SSN