MachilipatnamLocal News
September 20, 2026
అవనిగడ్డ

తెలుగు భాషా సేవకు మరింత బాధ్యత: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత ఉమాసరస్వతికి మండలి బుద్ధప్రసాద్ అభినందనలు

  • September 10, 2026
  • 0 min read
తెలుగు భాషా సేవకు మరింత బాధ్యత: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత ఉమాసరస్వతికి మండలి బుద్ధప్రసాద్ అభినందనలు

మచిలీపట్నం:

తెలుగు భాషా పరిరక్షణ, వికాసానికి పాఠశాల స్థాయి నుంచే బలమైన పునాది వేయాలని కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. పురిటిగడ్డ హైస్కూల్ ప్లస్‌లో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న డాక్టర్ ఓలేటి ఉమాసరస్వతి ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ ఆమెను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వైభవంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డా. ఉమాసరస్వతి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ గౌరవం లభించడంపై బుద్ధప్రసాద్ స్పందిస్తూ, రాష్ట్రస్థాయి అవార్డు సాధించడం ద్వారా ఆమెపై తెలుగు భాషా సేవకు సంబంధించి బాధ్యత మరింత పెరిగిందన్నారు. పాఠ్యాంశాలతో పాటు సాహిత్యం, పద్యాలు, కథలు, రచనా నైపుణ్యాలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేలా బోధన సాగాలని, అప్పుడే మాతృభాష గొప్పతనం భావితరాలకు అందుతుందని పేర్కొన్నారు.

డాక్టర్ ఉమాసరస్వతి తన వృత్తిపట్ల చూపిస్తున్న అంకితభావం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ, పురిటిగడ్డ విద్యాసంస్థకే కాకుండా కృష్ణా జిల్లా మొత్తానికి మంచి పేరు తెచ్చిపెట్టిందని బుద్ధప్రసాద్ కొనియాడారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని, మాతృభాషపై ప్రేమను పెంపొందించినప్పుడే తెలుగు భాషకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడుతూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని భాషా సేవలు అందించాలని ఆకాంక్షించారు.

About Author

SSN