MachilipatnamLocal News
July 22, 2026
జిల్లా

మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డులు

  • July 22, 2026
  • 1 min read
[addtoany]
మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డులు

ప్రతి శానిటేషన్ సిబ్బందికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది సూత్రాల్లో స్వచ్ఛాంధ్ర ఒక కీలక అంశమని, ఆ లక్ష్య సాధనలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో విజయవంతంగా అమలు చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 23 నుంచి జూన్ 26 వరకు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ఐదు పురపాలక సంఘాల పరిధిలో సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక దృష్టిని ‘బ్లాక్ స్పాట్స్ టు గ్రీన్ స్పాట్స్’ అనే భావనపై కేంద్రీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. తరచూ చెత్త పేరుకుపోయే ప్రదేశాలను ముందుగా గుర్తించి, వాటి జాబితాను రూపొందించామని చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడానికి గల కారణాలను విశ్లేషించి, డోర్ టు డోర్ చెత్త సేకరణలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించే చర్యలు చేపట్టామని వివరించారు.

చెత్త తొలగించిన ప్రదేశాలను తిరిగి చెత్త వేయకుండా ఉండేలా అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. మొక్కలు నాటడం, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బెంచీలు ఏర్పాటు చేయడం, పరిశుభ్రత సందేశాలతో అలంకరించడం వంటి చర్యల ద్వారా ఆ ప్రాంతాలను ప్రజలకు ఆహ్లాదకరమైన గ్రీన్ స్పాట్లుగా మార్చామని చెప్పారు. ఒక ప్రాంతం అందంగా మారితే అక్కడ చెత్త వేయడానికి ప్రజలు సహజంగానే వెనుకాడే విధంగా మానసిక మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 141 బ్లాక్ స్పాట్లను పూర్తిగా అభివృద్ధి చేసి గ్రీన్ స్పాట్లుగా మార్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, తాను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు స్థానికులు స్వయంగా వచ్చి అభినందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని గుర్తించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది పురపాలక సంఘాల్లో మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు అవార్డులు ప్రదానం చేయడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ విజయానికి కృషి చేసిన ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు, శానిటేషన్ సెక్రటరీ, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ఇదే స్ఫూర్తితో మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

About Author

SSN