గోశాల గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి
పెనమలూరు/మచిలీపట్నం:
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల గ్రామంలో బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి (DPO) శ్రీమతి ఎం. ధనలక్ష్మి విస్తృతంగా పర్యటించి, పారిశుధ్య నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
గ్రామంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు మరియు డ్రైనేజీలను తనిఖీ చేసిన ఆయన, ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. గ్రామంలో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్స్) పూర్తిగా తొలగించి, వాటిని మొక్కలతో సుందరీకరించి గ్రీన్స్పాట్స్గా తీర్చిదిద్దాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు:
రానున్న భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీపీఓ సూచించారు. నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాలను గుర్తించి, వర్షపు నీరు సులువుగా పోయేలా డ్రైనేజీలు, కాలువలను ముందస్తుగా పూడికతీత తీయాలన్నారు. గ్రామ పంచాయతీ వద్ద బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్, సున్నం, దోమల నివారణ మందులు మరియు అత్యవసర సామగ్రి తగినంత స్టాక్ ఉంచుకోవాలని ఆదేశించారు.
తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్ క్రమం తప్పకుండా చేస్తూ, నీటి ద్వారా మరియు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పారిశుధ్య వాహనాలు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్రజా భాగస్వామ్యంతో గ్రామాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సచివాలయ మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

