కూచిపూడిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
రూ 3 కోట్ల నిధులతో కూచిపూడి కళాక్షేత్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్, పామర్రు శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా
కూచిపూడి:
కృష్ణా జిల్లాకు గర్వకారణమైన కూచిపూడి కళను మరింత విస్తృతంగా ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కూచిపూడి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. బుధవారం ఉదయం మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, కూచిపూడి అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శంకుస్థాపన చేశారు. పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాతో కలిసి రూ. 3 కోట్ల నిధులతో కూచిపూడి కళాక్షేత్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోనేరు సమీపంలో మరుగుదొడ్ల నిర్మాణం పరిశీలన, గ్రామంలో రహదారుల అభివృద్ధి తదితర పనులపై వివరాలు ఆరా తీసి సంబంధిత అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచానికి తెలుగు జాతి అందించిన అమూల్యమైన కళారూపం కూచిపూడి అని పేర్కొన్నారు. అలాంటి విశిష్ట కళకు పుట్టినిల్లు అయిన కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో ఉండటం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. కూచిపూడిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో హెరిటేజ్ వాక్, కోనేరు రీడెవలప్‌మెంట్ వంటి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామంలో మరింత విస్తృత స్థాయిలో కూచిపూడి కళా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇక్కడ ఉన్న కూచిపూడి యూనివర్సిటీలో ఈసారి తొలిసారిగా నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌కు అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ఒకవైపు పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు మరోవైపు కూచిపూడి కళ ప్రతి ఇంటి గడపకు చేరేలా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కూచిపూడి కళ మరింత ప్రజ్వలంగా, ఉజ్వలంగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల విజయవంతానికి నిరంతరం కృషి చేస్తూ తరచూ ఫాలోఅప్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
కూచిపూడిని ప్రపంచ స్థాయి టూరిజం హెరిటేజ్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాం
పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలో ఉన్న చారిత్రాత్మక కూచిపూడి గ్రామాన్ని ప్రపంచ స్థాయి టూరిజం హబ్, హెరిటేజ్ విలేజ్‌గా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తెలిపారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కూచిపూడి కళ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశేష గౌరవాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. జపాన్, రష్యా వంటి దేశాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా కూచిపూడి నృత్యానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. భావితరాలకు ఈ కళ గొప్పతనం తెలియజేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీని అమలు దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారని తెలిపారు. కూచిపూడి గ్రామాన్ని టూరిజం హెరిటేజ్ విలేజ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని కోనేరు ప్రాంతాన్ని కళాక్షేత్రంగా అభివృద్ధి చేస్తూ, సమగ్ర రూట్ మ్యాప్ కనెక్టివిటీతో పనులు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద రూ .3 కోట్లతో, టూరిజం శాఖ నిధులతో ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గత మూడు నెలల్లో ఆరు సార్లు గ్రామాన్ని సందర్శించి, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ యుద్ధ ప్రాతిపదికన పనులు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాదిలో అంగరంగ వైభవంగా కూచిపూడి ఉత్సవాలను నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 3,500 మంది నృత్య కళాకారులు వివిధ దేశాల నుంచి వచ్చి గజ్జె కట్టి ఒకేసారి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడం అపూర్వ ఘట్టమని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కూచిపూడి సంస్కృతిని పరిరక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామ ప్రథమ పౌరుడిగా, శాసనసభ్యుడిగా కూచిపూడి అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ జిల్లా అధికారి జి రామలక్ష్మణరావు, తహసిల్దార్ మస్తాన్ రావు, ఎంపీడీవో దయాళ సుహాసిని, పలు శాఖల అధికారులు, కళాకారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

