కృష్ణా యూనివర్సిటీ అభివృద్ధికి సహకారం – ఆర్ టి సి చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు
ఉత్సాహంగా అచివర్స్ డే
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిరంతరం సహకరిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రకటించారు. మంగళవారం కృష్ణా విశ్వవిద్యాలయం లో నిర్వహించిన అచివార్స్ డే కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అద్దె భవనాల్లో ప్రారంభించిన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అభివృద్ధి బాటలో నడుస్తుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. మూడు జిల్లా ల పరిధిలో విస్తరించి ఉన్న కృష్ణా విశ్వవిద్యాలయం నూరు శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుస్తుండటం అభినందనీయమన్నారు.
విశిష్ట అతిధి గా పాల్గొన్న జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ పెద్ద పెద్ద లక్ష్యాలను ఎంచుకోవాలని ఆ దిశగా తమ తమ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని పిలుపునిచ్చారు. తల్లి తండ్రుల సైతం తమ అభిప్రాయాలను పిల్లల పై రుద్దే ప్రయత్నాలను మానుకోవాలన్నారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ఏజిఎం ఎఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పుల కు అనుగుణంగా విద్యార్ధులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు.
ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల క్రితం మచిలీపట్నం విద్యా కేంద్రంగా భాసిల్లింది అని, ఇక్కడ ఉన్న నోబెల్ కళాశాల, ఆంద్ర జాతీయ కళాశాల, హిందూ కళాశాల లు ఎందరో మహనీయుల ను జాతికి అందించటం జరిగిందన్నారు. అదే ఒరవడిని కృష్ణా విశ్వవిద్యాలయం కొనసాగించేలా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 225 మంది విద్యార్ధులకు వారి తల్లి తండ్రుల చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందచేశారు. తొలుత డ్రోన్ టెక్నాలజీ పై విద్యార్ధులకు అవగాహన కల్పించేలా బెల్ తో, ఫ్రాంక్లిన్ టెక్ సిస్టమ్స్ సి ఈ ఓ ఆర్. శివ కుమార్ తో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, ఫ్రాంక్లిన్ టెక్ సిస్టమ్స్ సి ఈ ఓ ఆర్. శివ కుమార్, విశ్వవిద్యాలయ ఉపాధి కల్పన, శిక్షణా విభాగం డైరెక్టర్ ఆచార్య వైకె సుందర కృష్ణ, సమన్వయకర్త డాక్టర్ కిషోర్, పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

