స్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం :
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరులో పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార రాజా తో కలిసి ఆఖరి మజిలీ హిందూ స్మశాన వాటికకు శంకుస్థాపన చేశారు. ఈ స్మశాన వాటిక నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు సమకూర్చగా స్థానిక గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి మరో 16 లక్షలు రూపాయలు సమకూర్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోను స్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని సూచిస్తున్నారన్నారు. మన కుటుంబంలోని ఒక వ్యక్తి మనతో ఉండి చిట్టచివరి ప్రయాణం గౌరవప్రదంగా జరగాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. స్మశాన వాటికలు సరిగా లేకపోతే ఆ కుటుంబం కూడా చాలా బాధలు పడే పరిస్థితి ఉంటుందన్నారు. ఇందులో భాగంగానే కృష్ణ సంకల్పం ఆఖరి మజిలీ కార్యక్రమం జిల్లాలో చేపట్టామన్నారు.
ప్రభుత్వము, ప్రజల భాగస్వామ్యంతో స్మశానవాటికలను అభివృద్ధి చేయాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక…మీకోసం కార్యక్రమంలో చాలావరకు ఇలాంటి స్మశాన వాటికలకు సంబంధించి అర్జీలు రావడంతో ఒక వీడియోను తయారుచేసి విడుదల చేయడం జరిగిందన్నారు. అందులో ఎవరైనా గ్రామంలోని స్మశాన వాటిక అభివృద్ధి చేయడానికి ఆసక్తిగలవారు ముందుకు వస్తే ప్రభుత్వ నిధులు కొంత ఇస్తామని, దాతలు విరాళం రెండు కలిపి ఓ చక్కటి స్మశాన వాటిక అభివృద్ధి పరచుకోవచ్చని పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు.
ఆ పిలుపు మేరకు ప్రస్తుతం జిల్లాలో 15 మంది దాతలు 15 గ్రామాల్లో స్మశాన వాటికల అభివృద్ధికి ముందుకు వచ్చారన్నారు. జిల్లాలో నార్త్ వల్లూరులో మొట్టమొదటి ఆఖరి మజిలీ కార్యక్రమం చేపట్టామని, ఆదర్శంగా స్మశాన వాటికను తీర్చిదిద్దుతామన్నారు. పామర్రు శాసనసభ్యులు ఏ కార్యక్రమం అయినా చెబితే ముందుకు వచ్చి సహకారం అందించడం సంతోషదాయకమన్నారు. స్మశాన వాటికకు స్థలం ఇచ్చిన దాతలు, నిధులు సమకూర్చిన దాతలకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ విషయం తెలుసుకుని జిల్లాలో మరి కొంతమంది దాతలు ముందుకు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అంకితభావంతో పనిచేస్తున్నామన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు శివాజీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహకారంతో కనుమూరు జాతీయ రహదారి మార్గంలో కోటి రూపాయల వ్యయంతో ఒక స్మశాన వాటికను నిర్మించనున్నామన్నారు. కలెక్టర్ స్ఫూర్తి, సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. మొదట నార్త్ వల్లూరులో ఈ కార్యక్రమానికి నాంది పలికామని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలా గ్రామాల్లో ఇటువంటి స్మశాన వాటికలను నిర్మించడం జరుగుతుందన్నారు. 25 శాతం నిధులు దాతలు సమకూరిస్తే 75 శాతం దాకా ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇంకా దాతలు స్మశాన వాటికల నిర్మాణానికి ముందుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, తహసిల్దారు కుసుమకుమారి, ఎంపీడీవో రవికాంత్, జడ్పిటిసి జొన్నల రామ్మోహన్ రెడ్డి, దాతలు, ప్రజలు పాల్గొన్నారు.

