ప్రజా భద్రతకు భంగం కలిగించేలా ఏ ఒక్క వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినా వారిపై చట్టంతో కొరడా ఝుళిపిస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. అంతర్ జిల్లాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ వివిధ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 70 కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా నమోదైన ఆరేపల్లి దుర్గారావు 38 సంవత్సరాలు నవీన్ మిట్టల్ కాలనీ అలవాటుదారుడిపై జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ప్రజా శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా అతనిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పి.డి.) యాక్ట్‌ను అమలు చేశారు.
గత కొంతకాలంగా వివిధ జిల్లాలలో దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతూ ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్న ఈ నిందితుడిపై సమగ్ర విచారణ చేసి, పలు కేసుల్లో అరెస్టయి, జైలు శిక్ష అనుభవించినప్పటికీ తన నేర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, సమాజానికి ముప్పుగా మారిన ఈ వ్యక్తిని నియంత్రించేందుకు పి.డి. యాక్ట్ అమలు చేశారు. ఇతనికి సంబంధించిన నేర నివేదికను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కి పంపగా నిజనిర్ధారణ కావడంతో అతనిపై పిడి ఆక్ట్ ప్రయోగించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ పిడి యాక్ట్ ద్వారా నేర కార్యకలాపాలను నిరోధించడంతో పాటు, ప్రజల ఆస్తి భద్రతను కాపాడటమే ముఖ్య ఉద్దేశమని ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అలవాటుదారులపై భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆరేపల్లి దుర్గారావు పై పీడీ యాక్ట్ అమలు పరచడానికి కృషిచేసిన బందరు ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాసరావు , ఆర్ పేట ఇన్స్పెక్టర్ కె. యేసు బాబు, బందర్ తాలూకా ఎస్సై సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.