బంటుమిల్లిలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు: ఐదుగురు నిందితుల అరెస్ట్, రూ. 1.82 లక్షల నకిలీ కరెన్సీ సీజ్
పెడన/బంటుమిల్లి:
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లిలో చెలామణి అవుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 1,82,500 విలువైన నకిలీ రూ. 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి..
ఈ నెల 26న బంటుమిల్లిలోని ఒక కిరాణా షాపులో గుర్తుతెలియని వ్యక్తులు వాటర్ బాటిల్, సిగరెట్ ప్యాకెట్ కొనుగోలు చేసి రూ. 500 నోటు ఇచ్చారు. ఆ నోటును పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల అరెస్ట్
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మిలేష్ రొయ్యల కంపెనీ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన నిందితులు:
- షేక్ జానీ
- చిట్టిబొమ్మ చినపాము
- వీళ్ల రామకృష్ణ
- దాసరి రామకృష్ణ
- గుడిసె అజయ్ కుమార్
ప్రింటర్, పేపర్లు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి రూ. 1,82,500 విలువైన నకిలీ 500 రూపాయల నోట్లతో పాటు, వాటి తయారీకి ఉపయోగిస్తున్న ఒక కలర్ ప్రింటర్, 197 A4 సైజ్ పేపర్లు, మరియు పేపర్ కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమయోచితంగా స్పందించి ముఠాను పట్టుకోవడానికి సహకరించిన వ్యాపారిని, పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.

