బచ్చుపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో కన్నులపండువగా లక్ష తులసి పూజ
మచిలీపట్నం:
స్థానిక బచ్చుపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష తులసి అర్చన కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి శశికాంత్ బ్రహ్మత్వంలో, ఆలయ చైర్మన్ ముక్తేవి రవికాంత్, కార్యనిర్వహణాధికారి (ఈవో) గోవాడ వెంకట కృష్ణారావు పర్యవేక్షణలో ఈ విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో 50 మంది సుహాసినులతో కలిసి భక్తిశ్రద్ధలతో స్వామివారికి తులసీదళాలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు చేశారు. తులసి పరిమళాలు, వేదమంత్రాల ఉచ్చారణల నడుమ బచ్చుపేట ఆలయ ప్రాంగణం విష్ణునామస్మరణతో మారుమోగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోట లక్ష్మీ కుమారి, ఐనంపూడి రాజశేఖర్, తాడేపల్లి హరి గోపాల్ రావు, బోయిన నాగలక్ష్మి, మాజీ ఈవో జక్క ధర్మారాయుడు, అన్నంభొట్ల బ్రహ్మానందశాస్త్రి, ముక్తేవి కృష్ణ ప్రసాద్‌లతో పాటు ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు.

