జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా ‘తెలుగు భాషా దినోత్సవం’
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ‘భారతీయ సాహిత్య పరిషత్’ ఆధ్వర్యంలో ‘తెలుగు భాషా దినోత్సవం’ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ.. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, నేడు విదేశాల్లో సైతం తెలుగు భాషకు గొప్ప ప్రాధాన్యతనిస్తూ శ్రద్ధ చూపుతున్నారని, మన మాతృభాష పట్ల మనమే ఆదరణ పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషను ప్రేమించి, ప్రోత్సహించాలని పిలుపునిస్తూ పలు పద్యాలు, గేయాలను ఆలపించారు. సాహిత్య పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ శాస్త్రి మాట్లాడుతూ, మన భావాలను, సంస్కృతీ సంప్రదాయాలను తరతరాలకు అందించే దివ్య వారధి తెలుగు అని కొనియాడారు. “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న రాయల మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసారు.
డిప్యూటీ లైబ్రేరియన్ శ్రీ బీరం వెంకటరమణ మాట్లాడుతూ, గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న ఈ వేడుకను జరుపుకుంటామని తెలిపారు. ప్రజల నిత్య జీవితంలో, వ్యావహారికంలో తెలుగు జీవించి ఉండేలా గిడుగు వారు చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. భాషా వికాసానికి, సంపదను భద్రపరచడానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రంగస్థల నటులు ఆగస్తేశ్వరరావు మాట్లాడుతూ అన్ని భాషలనూ గౌరవిస్తూనే మాతృభాషకు తగిన స్థానం ఇవ్వడం మన బాధ్యత అన్నారు.
అనంతరం “తెలుగులోనే మాట్లాడుదాం.. తెలుగులోనే రాద్దాం.. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకుందాం” అని సభలో ముక్తకంఠంతో సంకల్పం తీసుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, సాహిత్య ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

