MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

అవనిగడ్డ పంచాయతీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సంచలనం: నలుగురు అధికారులపై ‘ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్’

  • August 27, 2026
  • 1 min read

అవనిగడ్డ:

అవనిగడ్డ గ్రామ పంచాయతీలో చోటుచేసుకున్న రూ. 50 లక్షల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2012–16 మధ్య కాలంలో జరిగిన ఈ అక్రమాలపై సమగ్ర విచారణ అనంతరం, బాధ్యులైన నలుగురు అధికారులపై ‘ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్’ జారీ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు ఉత్తర్వులు ఇచ్చారు.

లోకాయుక్త విచారణతో వెలుగులోకి..

సామాజిక కార్యకర్త, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్ ప్రతినిధి జంపాన శ్రీనివాస గౌడ్ 2020 జనవరి 31న లోకాయుక్తలో దాఖలు చేసిన ఫిర్యాదు (కేసు నెం. 115/2020) ఆధారంగా ఈ విచారణ సాగింది. లోకాయుక్త న్యాయమూర్తులు జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి, జస్టిస్ పి. రజని ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ విచారణ జరిపి నివేదిక సమర్పించారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి–1991లోని రూల్ 9 ప్రకారం అధికారులపై అభియోగాలు ఖరారయ్యాయి.

అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు

వి. రంగారావు (మాజీ పంచాయతీ కార్యదర్శి): సర్టిఫికెట్ల ట్యాంపరింగ్ కేసులో ఇదివరకే నిర్బంధ పదవీ విరమణ పొందారు.
కె. రామ్ ప్రసాద్ (జూనియర్ అసిస్టెంట్): ప్రస్తుతం పులిగడ్డ పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎం. లక్ష్మణరావు (పంచాయతీ సిబ్బంది): ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు.
ఎల్.వి.వి.ఎస్. శ్రీనివాసరావు (మాజీ RWS AE): 2015 మే 13న మరణించారు.

అవినీతిపై పోరాటం ఆగదు

అవనిగడ్డ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలవడం విచారకరమని ఫిర్యాదుదారు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా తాగునీటి ట్యాపుల మంజూరు, ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతి అంతమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

About Author

SSN