MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

తుఫాను ముప్పు వేళ బియ్యం, ఇంధనాల కొరత రాకుండా ముందస్తు చర్యలు: జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్

  • October 27, 2026
  • 1 min read
తుఫాను ముప్పు వేళ బియ్యం, ఇంధనాల కొరత రాకుండా ముందస్తు చర్యలు: జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్

మచిలీపట్నం:

‘అర్నాబ్’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులు, ఇంధనం సజావుగా అందుబాటులో ఉండేలా పటిష్ట ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామ ప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తోందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

కృష్ణా జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి స్టేజ్-I కింద 7,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, స్టేజ్-II ద్వారా జిల్లాలోని మొత్తం 1,059 చౌకధరల దుకాణాల డీలర్లకు చేరవేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 5,26,666 రేషన్ కార్డుదారులకుగాను తుఫాను ప్రభావం రీత్యా ముందస్తుగానే బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటికే 46,180 మంది అర్హులైన లబ్ధిదారులకు బియ్యం అందించామని వివరించారు. రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా సకాలంలో లబ్ధిదారులకు అందేలా మండల, గ్రామ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

మరోవైపు ఎల్‌పీజీ గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంకుల యజమానులు తమ వద్ద గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ నిల్వలను తగినంతగా ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంధనాల కొరత ఏర్పడకుండా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అభయమిచ్చేలా ఇంధన సరఫరా నిరంతరం సాగాలని చెబుతూనే, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం లేదా అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి స్పష్టం చేశారు.

About Author

SSN